హైదరాబాద్ రోడ్లపై సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్..!!
హైదరాబాద్: వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, వాటికి సంబంధించి జంక్షన్లు, అనుసంధానత ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ (సౌత్), రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణంపై తన నివాసంలో సీఎం మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ (సౌత్)కు సంబంధించిన అలైన్‌మెంట్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు సూచించారు.
అటవీ ప్రాంతం, జల వనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విషయంలో ముందుగానే లైడర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. అలైన్‌మెంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి పొరపాట్లకు తావివ్వద్దని హెచ్చరించారు.శాటిలైట్ టౌన్‌షిప్‌లు...పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లకు రూపకల్పన చేయాలని సీఎం అన్నారు.ఓఆర్ ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.

హైదరాబాద్ నుంచి వెళ్లే జాతీయ,రాష్ట్ర రహదారులు ఆర్ఆర్ఆర్ వెలుపలికి వెళ్లే ప్రాంతంలో తగు రీతిలో ట్రంపెట్స్ నిర్మించాలని.. ఎటువంటి గందరగోళానికి తావులేకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా దాటేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్..నూతన అలైన్‌మెంట్‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్ నుంచి మంచిర్యాల వరకు నూతన రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పరిశీలించాలన్నారు. ఈ నూతన రహదారులకు సంబంధించి జాతీయ రహదారుల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications