• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాగుల్లోకి తొండలు చొరగొట్టి, చింత బరిగెల్తో: ఈటెల

By Pratap
|

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి లైన్లు ఆగిపోవడానికి నక్సలైట్లు కారణమని తాను అనలేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అన్నల ఫిలాసఫీ, పేదల ఫిలాసఫీ ఒకటేనన్నారు. తమ మధ్య ఏదైనా ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ‘2004లో దెబ్బకొడితే ఈ నాటికీ కోలుకోలేదు కొడుకా! ప్రజలు మిమ్మల్ని చింత బరిగెలతో కొడతారు.. ఖబడ్దార్‌' అంటూ తెలంగాణ టిడిపి నేతలపై విరుచుకుపడ్డారు.

తాను శనివారం చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటి వచ్చిందని ఈటెల అన్నారు. గత శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దండకారణ్యం నక్సలైట్‌ ప్రాంతం కావడం వల్లనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి గోదావరి నది మీదుగా తెలంగాణకు విద్యుత్‌ లైన్‌ వేయలేదని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై ఆయన స్పష్టత ఇచ్చారు.

విద్యుత్‌ విషయంలో సొంత కాళ్లపై నిలబడాలని, కరెంట్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఇక్కడే ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి లైన్‌ వద్దనుకున్నామని, ఈ రోజు విద్యుత్‌ డిమాండ్‌ను గమనంలోకి తీసుకొని, వచ్చే ఏడాదికి అంత ఉత్పత్తి ఉండేలా ఆలోచన చేస్తున్నామని ఆయన వివరించారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ లైన్‌ వేసే కాంట్రాక్టు ముఖ్యమంత్రి కెసిఆర్ బంధువుకు దక్కలేదని, నక్సలైట్ల సమస్యను తాము అడ్డంపెట్టుకొని లైన్‌ వేయలేదని అనటానికి బుద్ధి ఉండాలని ఆయన టిడిపి నేతలపై మండిపడ్డారు. తెలుగుదేశం కాంట్రాక్టర్ల పార్టీ అని, రూ.30-50 కోట్లకు రాజ్యసభ సీటును అమ్ముకునే పార్టీ అని, పైసల కోసం రాజకీయాలు చేసే పార్టీ అని, అటువంటి పార్టీలో కొనసాగుతూ ప్రజల సంపదపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని, తెలుగుదేశం నేతలు అభివృద్ధి నిరోధకులని ఆయన అన్నారు.

మనిషిలో రక్త ప్రసరణ ఎంత ముఖ్యమో కరెంట్‌ తీగల్లో విద్యుత్‌ సరఫరా అంతే ముఖ్యమని భావిస్తామని, అలాంటిది విద్యుత్‌ లైన్‌కు నక్సలైట్లు అడ్డుకున్నారని తాము అన్నట్టు మాట్లాడుతున్నారని, నక్సలైట్ల ఫిలాసఫీ, పేదల ఫిలాసఫీ ఒక్కటే. వాళ్ల కోసం కొట్లాడింది తామేనని, ఏదైనా ఉంటే చర్చ చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు నక్సలైట్లపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో మనుషులను మాయం చేసినోడు ఎవడరని రేవంత్ రెడ్డి చంద్రబాబును అడగాలని ఆయన అన్నారు.

చంద్రబాబు హయాంలోనే..

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయో రోజూ సమీక్షించింది ఎవరని, తెలంగాణలో రక్తపుటేరులు పారించింది ఎవరని, తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు యువకులు ఇళ్లలో పడుకోకుండా చేసింది ఎవరో చంద్రబాబును అడగాలని ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మామూలుగా విద్యుత్‌ లైన్‌ వేయాలంటేనే ఏడాదిన్నర సమయం పడుతుందని, అది దండకారణ్యం.. అరణ్య ప్రాంతం కావటం వల్ల ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ లైన్‌ వేయటానికి ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు.

విద్యుత్‌ లైన్‌ వేయటానికి నక్సలైట్లతో చర్చలు జరపటానికి సిద్ధమని ప్రజా గాయకుడు గద్దర్‌ చేసిన ప్రకటనను ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు - చర్చలు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదుని, భారతదేశానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని ఈటెల బదులిచ్చారు. ఆంధ్రా పార్టీలో ఎందుకు ఉండాలనే, టీడీపీ నుంచి నాయకులు బయటికి వస్తున్నారని, వారిలో కొందరిని డబ్బులకు మభ్యపెట్టి ఆపుతున్నారని, కానీ వారు ఎక్కువ కాలం ఆగరని, ఇవాళ కాకపోతే రేపైనా తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుస్తారుని ఆయన అన్నారు. తెలుగుదేశం నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని, టిడిపికి తెలంగాణలో భవిష్యత్తు లేదని, గుణపాఠం చెప్పితీరుతామని ఆయన అన్నారు.

Etela Rajender disowns media reports

రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించారు

తెలుగుదేశం పార్టీ నేతలు బస్సు యాత్ర ద్వారా రైతుల్లో అయోమయం సృష్టించారని, ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారిని ప్రేరేపించారని మంత్రి ఈటెల ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం, మంత్రులను అవమానించేలా ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. 2004లో ఒకవైపు రైతులు చనిపోతుంటే కేంద్రంలోని అప్పటి ఎన్డీయే సర్కారుతో కలిసి భారత్‌ వెలిగిపోతోందని పోస్టర్లు వేయించుకున్న దిక్కుమాలిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, దాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదని అన్నారు. వర్షాకాలంలో 38 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితుల్లో ఎప్పుడూ చూడని భయంకరమైన కరువు ఉంటే, ప్రభుత్వాన్ని నిందిస్తూ బస్సు యాత్ర చేయటానికి వారికి సంస్కారం ఉందా అని ప్రశ్నించారు.

ఎంగిలి మెతుకులకు...

డబ్బుకు కక్కుర్తిపడి, చంద్రబాబు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తెలంగాణ టిడిపి నేతలను దుయ్యబట్టారు. ఏటా తెలంగాణలో 53 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని, బొగ్గు కోసం అడుక్కునేది పరాయి వాళ్లపై ఆధారపడేది చంద్రబాబు అని, 17 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు హైటెక్‌ అనటం తప్ప మరో పదం ఉపయోగించని చంద్రబాబుకు తెలంగాణలో విద్యుత్‌ కేంద్రాలను పెట్టాలనే సోయి ఎందుకు లేదని అన్నారు.

గడిచిన పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ వాళ్లను విద్యుత్‌ కోసం ఎందుకు అడగలేదని, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ కోసం కరెంట్‌ ఎందుకు బుక్‌ చేయలేదని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana finance minister Etela Rajender retaliated Telangana Telugudesam leaders comments on power crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more