కేసీఆర్ నా శిశ్యుడే! నేనెంత చెబితే అంత: పోలీసులకు చిక్కిన ఫేక్ బాబా

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇటీవల కాలంలో ఫేక్ బాబాలు ఎక్కడపడితే అక్కడ పుడుతున్నారు. తాజాగా, ఓ దర్గా వద్ద ఉండే బాబా.. సీఎం కేసీఆర్‌ తన శిష్యుడని, తన భక్తులకు రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తానని పేదలు, అమాయకులను నమ్మించాడు. అంతేగాక, వారి నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు. కాగా, మరి కొంతమందిని మోసం చేసేందుకు ప్రయత్నిచగా.. పోలీసులు దాడి చేసి ఆ బాబాను అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లాకు చెందిన ఇర్ఫాన్‌షా ఖాద్రి(68) రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి పురపాలకంలోని పహాడీషరీఫ్‌ కొండపై కొలువైన బాబా షర్పుద్దీన్‌ భక్తుడు. గతంలో వారానికోమారు వచ్చి బాబా సమాధిని దర్శించేవాడు. అతనికి రాజేంద్రనగర్‌ శాస్త్రిపురంలో ఉండే నిజాం, పాతబస్తీలో ఉండే మరోవ్యక్తి ప్రియ శిష్యులయ్యారు..

Fake Baba deceiving to provide houses arrested

ఈ ఇద్దరి సలహాతో ఇర్ఫాన్‌షా ఖాద్రి పహాడీషరీఫ్‌ కొండపైనే ఓ మూలన గదిలో మకాం వేశాడు. మహిమలు ఉన్నాయని చెప్పుకొంటూ బాబా అవతారం ఎత్తాడు. దీంతో భక్తులు పెరిగారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన భక్తుడని చెప్పుకొచ్చాడు.

తాను చెప్పిన వారికి తప్పక రెండు పడక గదుల ఇళ్లు వస్తాయని నమ్మించాడు. అంతేగాక, ఒక్కో భక్తుని వద్ద రూ.12 వేలు తీసుకున్నాడు. సుమారు 60మంది వద్ద బాబా రూ.7.2 లక్షలు వసూలు చేశాడు. మరికొంత మందిని కూడా మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు అతని ఇద్దరు శిష్యులు సహకరించారు.

రాజేంద్రనగర్‌, పాతబస్తీలో రెండు పడక గదుల ఇళ్ల కోసం కేటాయించినట్లు చూపే పలు స్థలాల పత్రాలను తెచ్చి భక్తులకు చూపి.. ఇళ్లు వచ్చేస్తున్నాయని నమ్మించారు. దీంతో చాలా బస్తీల్లో బాబా గురించి ప్రచారం జరిగింది.

పహాడీషరీఫ్‌ పోలీసులకు ఈ విషయం తెలియడంతో రెండురోజుల క్రితం బాబా ఉండే చోట దాడులు జరిపి ఇర్ఫాన్‌షాఖాద్రిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఇద్దరు శిష్యులను కూడా గురువారం రాత్రి అరెస్టు చేశారు. ఇలాంటి ఫేక్ బాబాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపోవద్దని పోలీసులు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Inspector of Police, Mr. Lakshmikant Reddy told that Irfan Shah Qadri presently residing at Pahadi Shareef is a native of Bidar, Karnataka. He was deceiving the people by promising to provide double bedroom houses and collected thousands of rupees.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి