టీచింగ్ ఆస్పత్రుల్లో 1827 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్ర నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనాన్ని ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సచివాలయంలో సీఎంతోపాటు మంత్రులు పలు కీలక ఫైళ్లపై సంతకం చేశారు.
ఈ క్రమంలోనే సచివాలయంలోనే తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీజింగ్ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సుల రిక్రూట్‌మెంట్ దస్త్రంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మొదటి సంతకం చేశారు. ఇటీవల అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ. 151.6 కోట్లు విడుదల చేస్తూ రెండో ఫైల్ పై సంతకం చేశారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణ దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకిరస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఎట్టకేలకు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వేళ సాకారమైంది. సీఎం కేసీఆర్ నిర్ణయంపై కాంటాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో 2,909 జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ, 184 మంది జూనియర్ లెక్చరర్లు (వొకేషనల్), 390 మంది పాలిటెక్నికల్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్యారోగ్యశాఖలో 837 మంది వైద్య సహాకులు, వైద్యశాఖలో 179 ల్యాబ్ టెక్నీషియన్, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications