బిగ్ అలర్ట్: దంచి కొడుతున్న వర్షాలు - ఫ్లాష్ ఫ్లడ్స్..తాజా హెచ్చరికలు..!!
మొంథా తుఫాన్ తీరం దాటినా ఇంకా ముప్పు పొంచి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల్లో తక్షణ వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ ప్రకటించింది. ఏపీలో తీర ప్రాంతాలు యానంతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఈ ముప్పు పొంచి ఉంది. తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు. రానున్న 24 గంటలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మెంథా తుఫాను తీరం దాటింది తెలంగాణ దిశగా పయణిస్తోంది. తీరం దాటిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ(బుధవారం) రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కాగా, ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణశాఖ జారీ చేసింది. 14 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.
మరో వైపు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు అడపాదడపా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications