Tonique: రూ. 100 కోట్ల పన్ను ఎగవేసిన టానిక్ లిక్కర్ స్టోర్స్!, బడాబాబుల హస్తం?
హైదరాబాద్: నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న టానిక్ లిక్కర్ స్టోర్స్ పెద్ద మొత్తంలో పన్ను ఎగవేసినట్లు తేలింది. దీంతో ప్రభుత్వం చర్యలకు సమాయత్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో టానిక్ లిక్కర్ స్టోర్స్ పన్ను ఎగవేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదనే అంశంపైనా దృష్టి సారించింది. టానిక్ మద్యం దుకాణానికి అనుకూలంగా గత ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక జీవో ఇచ్చింది? అన్ని మద్యం దుకాణాలకు రెండేళ్లు లైసెన్స్ గడువు ఉంటే.. దీనికి ఎందుకు ఐదేళ్లు లైసెన్స్ గడువు ఇచ్చింది? అనే అంశాలపై దర్యాప్తు చేపడుతోంది.
అంతేగాక, నిర్దేశిత మద్యం డిపో నుంచి కాకుండా, రాష్ట్రంలోని ఏ మద్యం డిపో నుంచైనా మద్యాన్ని తెచ్చుకోడానికి వెసులుబాటు ఎందుకు కల్పించింది? మద్యంతో పాటు సాఫ్ట్ డ్రింకులు, సిగరెట్లు, గ్లాసులు లాంటివి విక్రయించుకోడానికి కూడా ఎందుకు అనుమతిచ్చింది? ఇలా సమాధానాలు లేని సవాలక్ష ప్రశ్నలను గత ప్రభుత్వం ఇచ్చిన జీవో తెరపైకి తెస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 2016 అక్టోబరు 26న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలైట్ షాప్ రూల్స్-2016 పేరిట ఓ జీవో ఇచ్చింది. ఈ జీవో ప్రకారం ఏర్పాటయ్యే దుకాణంలో ఫారెన్ వైన్, ఫారెన్ లిక్కర్, ఫారెన్ బీరుతో పాటు ఇండియన్ మేడ్ ప్రీమియం లిక్కర్, వైన్‌లు అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిబంధనలు కూడా తెలిపింది.

ఎక్సైజ్ శాఖకు చెందిన మద్యంపై వ్యాట్ విధింపు విషయమై వ్యాట్ చట్టం షెడ్యూల్ -6, ఎక్స్‌ప్లనేషన్-1 ప్రకారం తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే చెల్లించాల్సి ఉంది. దీంతో ఎలైట్ టానిక్ లిక్కర్ స్టోర్లకు బయటి దేశాల నుంచి మద్యం దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ.. ఆ సరకును టీఎస్‌బీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, లేబులింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, అలా చేసినట్లయితే నిర్దేశిత 70 శాతం వ్యాట్ ప్రభుత్వానికి వచ్చేస్తుంది. కానీ, ఇక్కడ టానిక్ మద్యం దుకాణానికి ఎలైట్ షాపు పేరుతో ఇచ్చిన జీవోలో దుకాణదారులకు అనుకూలంగా అనేక వెసులుబాట్లు కల్పించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరున ఈ టానిక్ మద్యం దుకాణం లైసెన్స్ ఉంది. టానిక్ మద్యం దుకాణం ఏర్పాటు చేసిన బంజారాహిల్స్‌లో సాధారణ మద్యం దుకాణానికి లైసెన్స్ ఫీజు రూ.1.10 కోట్లు ఉండగా.. టానిక్ దుకాణం లైసెన్స్ ఫీజు మాత్రం రూ.1.25 కోట్లుగా ఉంది. అయితే ఈ టానిక్ మద్యం దుకాణానికి అనుబంధంగా మరో 9 మద్యం దుకాణాలు ఇదే బ్రాండ్ పేరుతో హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఈ టానిక్ మద్యం దుకాణం ఏర్పాటు తెర వెనుక, గత ప్రభుత్వానికి చెందిన బడాబాబులు ఉన్న కారణంగానే.. ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ జీవో గురించి కానీ, నియమ నిబంధనల గురించి కానీ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో పన్ను (tax) రూపంలో రావాల్సిన సుమారు రూ. 100 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లయింది.












Click it and Unblock the Notifications