సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ కవితకు మేలుచేసే పాయింట్స్ చెప్పారుగా!!
బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. అయితే కవిత అరెస్టు పైన బిఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు పార్లమెంటు ఎన్నికలకు లింకు పెడుతూ బిజెపిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కవిత అరెస్టు అక్రమమని బీఆర్ఎస్ నేతలు వాదిస్తుంటే ఆమెను ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేశామని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ వ్యవహారంలో ఈడి అధికారులు చేసింది తప్పా... ఒప్పా అన్న చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా జరుగుతుంది. ఇక తాజాగా కవిత అరెస్టుపై సిబిఐ మాజీ జెడి, జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సిఆర్పిసి చట్టం ఏం చెప్తుంది ? ఇందులో మహిళలకు ఉన్న వెసులుబాటు ఏమిటి? వంటి అనేక విషయాల పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

161 సీఆర్పీసీ చట్టం ప్రకారం మహిళలు విచారణ కార్యాలయాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదని, విచారణ అధికారులే మహిళల వద్దకు వచ్చి విచారణ జరుపుతారన్నారు. గతంలో కూడా ఈడి అధికారులు కవితను ఢిల్లీకి పిలిపించారని, తాము కవితను విచారిస్తున్నది పిఎమ్ఎల్ఏ చట్టం కింద అని సిఆర్పిసి కిందికి రాదని అప్పుడు చెప్పారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇంకా తమ తుది తీర్పును వెల్లడించలేదన్నారు.
ఇదిలా ఉంటే ఒక కేసులో వ్యక్తిని అరెస్టు చేసే అధికారాలు దర్యాప్తు సంస్థలకు ఉంటాయని అయితే కవితను ఢిల్లీలో మెజిస్ట్రేట్ ఎదుట తప్పనిసరిగా హాజరుపరచాలని, ఎందుకు కవితను అరెస్టు చేయాల్సి వచ్చిందో మెజిస్ట్రేట్ ముందు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో కవిత న్యాయవాది కూడా అక్కడ వాదనలు వినిపించవచ్చని దర్యాప్తు సంస్థకు సహకరిస్తున్నప్పటికీ ఇలా అరెస్టు చేయడం కరెక్ట్ కాదని వాదన మెజిస్ట్రేట్ కు వివరించవచ్చని పేర్కొన్నారు.
అంతే కాదు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మహిళలను సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అరెస్టు చేయకూడదని, ఒకవేళ అలా అరెస్టు చేయాల్సి వస్తే మెజిస్ట్రేట్ నుండి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలని సిబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సూచించారు. ఇక క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఎవరిని అరెస్ట్ చేసినా 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని కవితను కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని పేర్కొన్నారు.

అంతేకాదు ఎవరినైనా అరెస్టు చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన అరెస్టు వివరాలను వారికి సన్నిహిటంగా ఉండే ఒకరికి సమాచారం ఇవ్వాలని, ఈ విషయాన్ని కేస్ డైరీలో కూడా రాయాలని, కేసు మెమోలో వాళ్ళ సంతకం కూడా ఉండాలని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సూచించారు. ఇక కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అరెస్టు చేస్తే దీన్ని కూడా సుప్రీంకోర్టులో మళ్లీ సవాల్ చేయవచ్చు అని పేర్కొన్నారు.
కవిత అరెస్ట్ లో రాజకీయ అంశాలు ఉన్నాయని భావిస్తే మెజిస్ట్రేట్ ఎదుట వాటిని ఆమె ప్రస్తావించవచ్చు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయంలో రాజకీయ ప్రేరేపిత చర్యగా ఈ అరెస్టును వారు నిరూపిస్తే రిలీఫ్ వచ్చే అవకాశం ఉందనీ తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న సమయంలో కానీ ఎవరిని అరెస్టు చేయకూడదని ఎక్కడా నియమావళిలో లేదని కూడా వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications