కాంగ్రెస్‌కు ధక్కా- బీఆర్ఎస్‌లో మాజీ ఎమ్మెల్యే..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్తోన్నాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా వెలువడింది. 45 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. కీలక నియోజవర్గాలు, అదే స్థాయిలో సీనియర్ల పేర్లు ఇందులో ఉన్నాయి. మధుయాష్కీ గౌడ్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహ్మద్ అజరుద్దీన్, పీ విజయారెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. వంటి సీనియర్ల పేర్లు ఉన్నాయి.
ఈ లిస్ట్ కాస్తా కాంగ్రెస్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. టికెట్ ఆశించిన ఆశావహులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాల్లో కూడా తమ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.
మొన్నటికి మొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఇక తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మాజీ శాసన సభ్యుడు ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపించారు.
ఆ వెంటనే- బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గులాబీ కండువాను కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్. గతంలో జడ్చర్ల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. టికెట్ల కేటాయింపులో తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications