
చావు పిలిచినట్లయింది: కష్ణాల్లో కళ్ల ముందే బావి మింగేసింది
వరంగల్: ఎక్కడో ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ఒక్కగానొక్క కొడుకు నవీన్ సెలవుల్లో హన్మకొండకు రావడంతో నయీంనగర్‌కు చెందిన కన్నం రామస్వామి, శారదా దేవి సంబరపడ్డారు. నాలుగు రోజుల పాటు స్వస్థలంలో ఉండే కుమారుడితో సరదగా గడిపేలా ఏర్పాట్లు చేసుకున్న తల్లిదండ్రులు తమ ఇష్టదైవం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు.
కొండగట్టు అంజన్నకూ మొక్కు ఉండడంతో వేములవాడ, కొండగట్టుకు వెళ్లొద్దామని నిర్ణయించుకున్నారు. కొమురవెల్లి, వేములవాడలో దర్శనాలు ముగించుకొని కొండగట్టుకు కారులో బయలుదేరారు. కొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటారనగా రహదారిపై గుంతను తప్పించబోగా కారు వేగంగా వెళ్లి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. కారులో అయిదుగురు ప్రయాణిస్తుండగా కారు నడుపుతున్న నవీన్‌కుమార్ తప్పించుకోగా నలుగురు కారుతో పాటు నీట మునిగి చనిపోయారు.
హన్మకొండ నయీంనగర్ మూడ్‌చింతల్ చెందిన కన్నం రామస్వామి ఎస్‌బీఐ మేనేజర్‌గా పదవీ విరమణ పొందగా భార్య శారదాదేవి హన్మకొండలోనే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడైన నవీన్‌కుమార్ ఆస్ట్రేలియాలో ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే నవీన్ ఇంటికి రాగా కుంటుబమంతా సంతోషంగా గడుపుతున్నారు. దైవదర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకోవడానికై తమ ఆల్టో కారులో బుధవారం మధ్యాహ్నం నవీన్ తన తల్లిదండ్రులు శారద, రామస్వామి, అత్తమ్మ సుభాషిణితో కలిసి బయలుదేరారు.

నగర కాంగ్రెస్ నేత అయిన కుమారస్వామి బీసీ ఐకాస కోకన్వీనర్‌గానూ వ్యవహరిస్తున్నారు. సుభాషిణి స్టేషన్ ఘన్‌పూర్ ఐసీడీఎస్‌లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కుమారస్వామి గోపాల్‌పూర్ మహాత్మానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరంతా తొలుత కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని సాయంత్రం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానాకి చేరుకుని రాత్రి అక్కడే బసచేశారు. ఆలస్యంగా బయలుదేరిన మేనమామ కూర కుమారస్వామి నేరుగా వేములవాడుకు చేరుకున్నారు. గురువారం ఉదయం దైవదర్శనం చేసుకుని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శనానికై మధ్యాహ్నం 2.30గంటలకు బయలుదేరారు.
నల్లగొండ గ్రామశివారులోని మూలమలుపు వద్దకు చేరుకోగానే రహదారిపై ఉన్న గుంతను తప్పించడానికి ప్రయత్నించగా అదుపుతప్పిన కారు వ్యవసాయబావిలోకి దూసుకెళ్లింది. బావిలో నీళ్లు అధికంగా ఉండటంతో కారు పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. గమనించిన ప్రయాణికులు, స్థానికులు పెద్దఎత్తున ప్రమాద స్థలానికి చేరుకుని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గత ఈతగాళ్ల సాయంతో కారుకు తాళ్లను కట్టి కొంతమేర పైకి తీసుకువచ్చారు. అనంతరం క్రేన్ సాయంతో కారును ఒడ్డుపైకి తీసుకొచ్చారు.
కారులో విగత జీవులుగా పడి ఉన్న కన్నవారిని, బంధువులను చూసి నవీన్ కన్నీరుమున్నీరుకాగా అక్కడున్న వారందరినీ ఈ సంఘటన కంటతడిపెట్టించింది. రహదారికి వ్యవసాయ బావులు ఆనుకుని ఉండటం, రహదారి సైతం ''ఎస్'' ఆకారంలో మలుపులుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలాన్ని జగిత్యాల జిల్లా ఎస్పీ అనంతశర్మ, సబ్ కలెక్టర్ శశాంక పరిశీలించారు. మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుమార్ తల్లి హృద్రోగి కాగా.. ప్రాణాలతో బయటపడిన నవీన్ భార్య రమ్య గర్భిణి.
దీంతో వీరికి విషయం చెప్పకుండా ఉండడానికి హన్మకొండలోని బంధువులు నానా తంటలు పడ్డారు. కుమార్ కుటుంబ సభ్యుల మృతదేహాలను శుక్రవారం తెల్లవారుజాములోపే నగరానికి తీసుకురానున్నట్లు వారి బంధువులు తెలిపారు. అనంతరం నగరంలోని పోచమ్మకుంట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని వివరించారు.
సుపరిచితుడే
కూర కుమార్ నగరంలో అందరికి సుపరిచితులే. అయిదుగురు అన్నదమ్ముల్లో నాలుగోవారైన కుమార్ అందరితో కలివిడిగా ఉండేవారు. ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో 44వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన బతుకమ్మ ఉత్సవాల నిర్వహణలో చురుకుగా పాల్గొనేవారు. కుమార్ పెద్దన్నయ్య సురేందర్ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. కుమార్-సుభాషిణి దంపతుల ఏకైక కుమారుడు ప్రజ్ఞ సాయి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటర్మీయేట్ చదువుతున్నాడు.
చావు పిలిచినట్లయింది..!
రోడ్డు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు చేరిన కుమార్‌ను చావే పిలిపించుకున్నట్లయిందని ఆయన బంధువులు రోదిస్తూ తెలిపారు. కొమురవెల్లికి వెళ్లే క్రమంలో నవీన్, అతని తల్లిదండ్రులు, మేనత్న సుభాషిని మొదట వెళ్లారు. వీరి వెంట వెళ్లిన కారు డ్రైవర్‌కు వ్యక్తిగత పనులు ఉన్న నేపథ్యంలో ఆయన కారు వేములవాడలో ఉంచి అక్కడి నుంచి బుధవారం రాత్రి బస్సులో నగరానికి తిరిగి వచ్చాడు. దీంతో కొండగట్టుకు వెళ్దాం రమ్మని కుటుంబ సభ్యుల ఒత్తిడి చేయడంతో కుమార్ బస్సులో బుధవారం రాత్రి వేములవాడకు వెళ్లారు. గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనా మృత్యువాత పడ్డారు. దీంతో చావే ఆయనను రమ్మని పిలిచినట్లయింది.
భయపడ్డ నీరే మింగేసింది
కుమారస్వామికి నీరన్నా.. అతివేగమన్నా భయం. అందుకే తన వాహనాన్ని ఎప్పుడు 60 కి.మీ. స్పీడ్ దాటకుండా చూసేవారు. వేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని.. తన స్నేహితులూ ప్రమాదాలకు గురయ్యారని, మెళ్లిగా వెళ్లమని ఆయన అందరికీ సూచించేవారు. ఇక నీరంటే ఆయనకు ఎంతో భయం. స్నేహితులంతా ఈత నేర్చుకున్నా కుమార్ నేర్చుకోలేదు. చివరికి తాను భయపడిన నీరు, అతి వేగం వల్లే తనువు చాలించాల్సి వచ్చిందని సన్నిహితులు కన్నీరు పెట్టుకున్నారు.
క్షణ కాలం.. కళ్లముందే!
కొండగట్టుకు కొద్ది సేపట్లో చేరేవాళ్లం. అంతా కబుర్లు చెప్పుకుంటున్నాం.. రోడ్డుపై గుంత తప్పించబోయా.. ఏ జరిగిందో అర్థం కాలేదు. రెప్పపాటులో కారు దూసుకుపోయింది. అమ్మానాన్న.. అత్తమామ నీళ్లలో మునుగుతుంటే కాపాడాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు కారు తలుపులు కష్టంగా తెరుచుకుని బయటకు వచ్చాను. ఈత రాకపోవడం, కారు నీళ్లలో పూర్తిగా మునిగిపోవడంతో కాపాడలేకపోయా - నవీన్ కుమార్