శాసనమండలి ఛైర్మన్ ఖరారు - రేపు నామినేషన్ : డిప్యూటీగా ఆయనకే..!!
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ - డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖరారు అయ్యాయి. ఈ రోజు తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 14న చైర్మన్ ఎన్నిక జరుగనుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. గతేడాది జూన్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ల ఎమ్మెల్సీ సభ్యత్వ కాలం నేటితో ముగిసింది.
దీంతో ప్రోటెం చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మండలిలోని ఖాళీలన్నీ భర్తీకావడంతో తాజాగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రకట వెలువడింది. కొత్త ఛైర్మన్ ఎంపికకు సంబంధించి గవర్నర్ కు సమాచారం ఇచ్చిన మండలి అధికారులు..నూతన ఛైర్మన్ ఎంపికకు సంబంధించి అనుమతి తీసుకున్నారు. అయితే, అధికార పార్టీకి మండలిలో మెజార్టీ ఉండటంతో ఎవరికి మండలి ఛైర్మన్ - డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం ఇస్తారనే అంశం పైన చర్చ జరిగింది.

కానీ, అసెంబ్లీ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రిని సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసారు.గుత్తా సుఖేందర్ రెడ్డికే మరోమారు కౌన్సిల్ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో రేపు గుత్తా నామినేషన్ వేయనున్నారు. ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు.
ఎన్నిక కోసం ముందురోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు ఎన్నిక తేదీలు, సమాచారం, ప్రక్రియను వివరిస్తూ అధికారులు ఇవాళ ఎమ్మెల్సీలకు సమాచారమిస్తూ లేఖలు పంపనున్నారు. గతంలో మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సుఖేందర్ రెడ్డి... ఇటీవల శాసనసభ కోటా నుంచి మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు మరోమారు మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఛైర్మన్ ఎన్నిక అనంతరం డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక కూడా చేపట్టే అవకాశం ఉంది. డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఓసీకీ మండలి ఛైర్మన్ పదవి..బీసీలకు డిప్యూటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సోమవారం గుత్తా శాసనమండలిలో అధికారికంగా మరోసారి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించటం లాంఛనంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications