పూరీ బీచ్ వద్ద కేసీఆర్ సైకత శిల్పం - మంత్రి హరీష్ రక్తదానం : సీఎం జన్మదిన వేడుకలు..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆరంభం అయ్యాయి. ఈ సారి ఆయన జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో..విదేశాల్లోని టీఆర్ఎస్ అభిమానులు సైతం కేసీఆర్ జన్మదిన వేడుకలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హోర్డింగ్ లు ఏర్పాటు చేసి తమ అధినేతకు జన్మ దిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, ఈ సారి ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది.

కేసీఆర్ బర్త్ డే స్పెషల్
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్..సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్ రెడ్డి సమన్వయంతో రూపొందించిన భారీ సైకత శిల్పం ఇప్పుడు గులాబీ శ్రేణులను ఆకట్టుకుంటుంది. ఒడిశాలో పూరీ జగన్నాథుడి చెంత.. పూరీ బీచ్ వద్ద సీఎం కేసీఆర్ భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. కేసీఆర్ చిత్రపటాన్ని పూర్తిగా ఇసుకతో తీర్చి దిద్దారు. ఆ ఫొటో కు ది ఫైటర్..అడ్మినిస్ట్రేటర్..అండ్ ది విజనరీ పేరుతో క్యాప్షన్ జత చేసారు. పూరీ బీచ్ వద్ద ఇసుకనే కాన్వాస్ గా మలిచి ఇసుకతోనే ఎంతో సుందరంగా ఆకర్షణీయంగా రూపొందించిన సీఎం కేసీఆర్ సైకత చిత్రం పలువురిని ఆకర్షిస్తోంది.

సేవా కార్యక్రమాల్లో పార్టీ నేతలు
బీచ్ వద్దకు వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు సైతం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇప్పటి వరకూ సుదర్శన్.. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సన్నివేశాలను, ఎందరో వీరులను, సెలబ్రెటీలు సైకత శిల్పాలుగా మలిచారు. కాగా సుదర్శన్ ఇప్పటి వరకూ ముఖ్యమంత్రుల్లో ఒక్క ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని మాత్రమే రూపొందించారు. తాజాగా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రుల్లో రెండవ వ్యక్తిగా నిలిచారు. ఇక, హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో పాటుగా.. ఇతర ప్రాంతాల్లోనూ రక్తదాన శిబిరాలు..వైద్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

హరీష్ రక్తదానం
గత రెండేళ్లుగా కరోనా కారణంగా సీఎం కేసీఆర్ జన్మదినం నిరాడబంరంగా జరిగింది. ఈ సారి అభిమానులు భారీ స్థాయిలో నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ముఖ్యంగా మంత్రులు ఇప్పటికే రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నారాయణ్ ఖేడ్ లో మంత్రి హరీష్ రావు రక్తదానం చేసారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ ..పలువురు ఎంపీలు సైతం రక్తదాన..వైద్య శిబిరాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజవకర్గాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications