పది ప్రశ్నలు: చంద్రబాబుపై హరీష్ రావు సంచలనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు హరీష్ బహిరంగ లేఖ రాశారు. ఇందులో బాబుకు పది ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో అభివృద్ధిని చంద్రబాబే అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
హైదరాబాదు పైన గవర్నర్‌కు అధికారులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతున్నారని విమర్శించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ పైన ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు.

తెలంగాణకు రావాల్సిన 710 మెగావాట్ల విద్యుత్‌ను ఎందుకు నిలిపి వేశారని ప్రశ్నించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదులో ఆక్రణదారులకు చంద్రబాబు మద్దతుగా నిలుస్తున్నారని, అది ఎంత వరకు సమంజసం అన్నారు.
నేషనల్ కన్‌స్ట్రక్షన్ అకాడమీ డైరెక్టర్ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీజేపీ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. బాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా, తెలంగాణపై విషం చల్లేందుకే అధిక సమయం వెచ్చిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications