Huzurabad Bypoll Results: కాసేపట్లో తొలి ఫలితం: ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేనా..!!
ప్రతిష్ఠాత్మకంగా సాగిన హుజూరాబాద్ విజేత ఎవరో కాసేపట్లో తేలిపోనుంది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక తొలి ఫలితం కాసేపట్లో వెల్లడి కానుంది. కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికలో గెలుపు ఎవరిదో ఉత్కంఠ పెరిగిపోతోంది. అక్టోబరు 30న పోలింగ్ జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేశారు.

తొలి గంటలో తొలి ఫలితం
ముందుగా ఏజెంట్ల సమక్షంలో 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో రౌండ్‌లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. రెండు హాళ్లలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఉదయం 9 గంటల వరకు తొలి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్‌కు కనీసం 30 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెల్లడవుతుంది.

రెండు ప్రధాన పార్టీలు ధీమా
కొవిడ్ టీకా రెండు డోసులు పూర్తయిన వారినే కౌంటింగ్ సిబ్బందిగా తీసుకున్నారు. ర్యాపిడ్ టెస్టు కూడా నిర్వహించారు. రెండు డోసులు తీసుకున్న వారికే పార్టీల కౌంటింగ్ ఏజెంట్ పాసులు జారీ చేశారు. విధిగా మాస్కు ధరించి రావాలని ఆదేశించారు. ఇక, పోలింగ్ సమయంలో కొద్దిపాటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తటంతో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసారు. రికార్డు స్థాయిలో పోలింగ్ జరగటంతో రెండు ప్రధాన పార్టీలు విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చివరి రెండు గంటల్లో చోటు చేసుకున్న పోలింగ్ సరళి ఇప్పుడు ఎవరికీ అంతుబట్టటం లేదు.

ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా
ఈటల గెలుస్తారని చెబుతూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అనేది కాసేపట్లో తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈటల రాజకీయ భవిష్యత్ తో ఈ ఫలితం ముడి పడి ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఈటలకు అనుకూలంగా ఇచ్చినా.. చివర్లో జరిగిన పోలింగ్ వారు పరిగణలోకి తీసుకోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో..ఆ రెండు గంటల్లో జరిగిన పోలింగ్ ఫలితాల డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది. ఇదే నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలకు మంచి పట్టు ఉంది.
Recommended Video

తెలంగాణ రాజకీయాలకు కీలకంగా
అయితే, పార్టీ మారటంతో పాటుగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయనకు నియోజకవర్గ ప్రజలు ఏ స్థాయలో మద్దతుగా నిలిచారనేది తేలాల్సి ఉంది. ఇక, అధికార టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నిక వేళ అనేక వ్యూహాలు అమలు చేసింది. వాటి ద్వారా ఏ మేర ఓట్లుగా మలచుకోగలిగిందనేది తేలి పోనుంది. ఇక, ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు కారణం అవుతుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా ఈ ఫలితం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications