హైదరాబాద్ విమానాశ్రయంలో ఏమైనా పోగొట్టుకున్నారా? రియల్‌టైమ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ మీకోసం!
హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులకు మరో మెరుగైన సేవ అందుబాటులోకి వచ్చింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ తొలిసారిగా రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ డిజిటల్ వేదిక ద్వారా పోగొట్టుకున్న వస్తువుల గురించి ఫిర్యాదు చేయడం, వాటి స్థితిని తెలుసుకోవడం, తిరిగి పొందే ప్రక్రియ సులభతరం అవుతుంది.
ఇప్పటి వరకు పోగొట్టుకున్న సామాను కోసం విమానాశ్రయంలోనే వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లోనే అంతా చేసుకోవచ్చు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లి 'Raise a Request' పై క్లిక్ చేసి పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలి. పోయిన వస్తువు కేటగిరీ ఎంచుకుని, ఎక్కడ, ఎప్పుడు పోయిందో వివరాలు రాసి, సాధ్యమైతే ఫొటో కూడా అప్‌లోడ్ చేయవచ్చు.

వివరాలన్నీ ఇచ్చిన తర్వాత ఈమెయిల్‌లో ప్రత్యేక రిఫరెన్స్ ఐడీ వస్తుంది. ఆ ఐడీతో ఎప్పుడైనా మనం ఇచ్చిన కంప్లైంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. వస్తువు దొరికినప్పుడు, ధ్రువీకరణ జరిగినప్పుడు, తిరిగి అప్పగించే వరకు ప్రతి దశలో అప్‌డేట్స్ వస్తాయి. అవసరమైతే లాస్ట్ అండ్ ఫౌండ్ బృందంతో నేరుగా సంప్రదించే సౌకర్యం కూడా ఉంది.
ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ కధిరవన్ మాట్లాడుతూ, ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం మా ప్రాధాన్యం అన్నారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే ప్రక్రియలో పారదర్శకత, సౌలభ్యం పెరుగుతాయన్నారు. ఒకే వేదికపై అన్ని వివరాలు నమోదు చేసుకుని, స్థితిని ట్రాక్ చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయాణికులకు మరింత నమ్మకం, భరోసా కల్పించాలని మేం కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ సేవ హైదరాబాద్ విమానాశ్రయం అధికారిక వెబ్‌సైట్‌లోని లాస్ట్ అండ్ ఫౌండ్ పేజీ ద్వారా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రయాణికులు సులభంగా ఉపయోగించుకుని, తమ వస్తువులను త్వరగా తిరిగి పొందవచ్చు. డిజిటల్ సేవల ద్వారా విమానాశ్రయ అనుభవాన్ని మరింత మెరుగు పరిచేలా శంషాబాద్ విమానాశ్రయ నిర్వహణా బాధ్యతలను చూస్తున్న జీఎంఆర్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications
