హైదరాబాద్ మెట్రో తీపికబురు.. ఇకపై 6 కోచ్ లతో భారీ రైళ్ళే,. నో ఫికర్!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులను ప్రారంభించటానికి కేంద్రం కసరత్తు చేస్తున్న సమయంలో మరో శుభవార్త మెట్రో ప్రయాణికులను సంతోషానికి గురి చేస్తుంది. నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మూడు కోచ్‌ల రైళ్లకు బదులుగా, ఆరు కోచ్‌ల భారీ మెట్రో రైళ్ళు
ప్రస్తుతం ఉన్న మూడు కోచ్‌ల రైళ్లకు బదులుగా, ఆరు కోచ్‌ల భారీ మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ప్రాథమికంగా 10 కొత్త ఆరు కోచ్‌ల రైళ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 6 కోచ్‌ల రైళ్లు అందుబాటులోకి వస్తే, ఒక్కో ట్రిప్పులో ప్రయాణ సామర్థ్యం రెట్టింపు కావటానికి ఆస్కారం ఉంటుంది. రద్దీ తగ్గటంతో పాటు, వేచి ఉండే సమయం తగ్గి ప్రయాణం సుఖవంతమవుతుంది.

ప్రభుత్వ ఆమోదం కోసం నిరీక్షణ
ప్రభుత్వ ఆమోదం రాగానే దీని కోసం గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ మొదటిదశ మెట్రో ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటేనే రెండో దశకు నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో యాజమాన్య బదిలీ ఆర్థిక అంశాలను పరిశీలించడానికి ఐడీబీఐ క్యాపిటల్‌ను ఆర్థిక సలహాదారుగా నియమించారు.
మెట్రోను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవటానికి కసరత్తు
ఈ సంస్థ మెట్రో ఆస్తులు, అప్పులు, నిర్వహణ వ్యయాలను మదింపు చేస్తోంది. తన సమగ్ర నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదిక తర్వాత ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. కాగా సాంకేతిక అంశాలపై అధ్యయనం కోసం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్ (HAML) ప్రత్యేక కమిటీని నియమించనుంది. మెట్రో ప్రభుత్వం ఆధీనంలోకి వస్తే ఛార్జీల నియంత్రణ, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అంచనా.
అదనపు కోచ్‌ల కొనుగోలుపై ప్రభుత్వం ఫోకస్
బదిలీ ప్రక్రియ పూర్తి కాకముందే, పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అదనపు కోచ్‌ల కొనుగోలును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండో దశ విస్తరణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ రైళ్ల రాక హైదరాబాద్ రవాణా వ్యవస్థలో మరో కీలక అడుగు అవుతుందన్న అభిప్రాయం ఉంది. ఐటీ కారిడార్‌తో సహా ప్రధాన మార్గాల్లో ప్రయాణించే లక్షలాది మందికి ఇది పెద్ద ఊరటకలిగించే అంశం కానుంది. .












Click it and Unblock the Notifications