Hyderabad rains: ఇప్పుడు చెప్పండి.. హైదరాబాద్ రోడ్లు అమెరికా, లండన్ రోడ్లేనా?
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని నగరం హైదరాబాద్ అతలాకుతలంగా మారుతుంది. చినుకు పడితే చాలు చిత్తడిగా మారే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో హైదరాబాద్లో తాజా వర్షాల పరిస్థితిపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తు చేసిన ఈటల ప్రస్తుత పరిస్థితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ రాజ్ భవన్ ముందు పడవలు వేసుకొని పోవాల్సిన దుస్థితి ఉంది దీన్ని మర్చేస్తాం అన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ రోడ్లను అమెరికా, లండన్ రోడ్లలాగా చేస్తా అని చెప్పారని, ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని రోడ్లను చూసి సమాధానం చెప్పాలన్నారు.

చిన్న వర్షానికి నగరం జలమయమై, రోడ్లు చెరువులై, జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంటే మరి తొమ్మిదేళ్లుగా మీరు ఏం చేస్తున్నారు ? అంటూ ప్రశ్నించారు. ఫ్లైఓవర్ల కింద అండర్ పాస్ లు నీళ్ళు నిండిపోయి వాహనాలు వెళ్ళలేక జనాలు ఇబ్బందిపడుతున్నారన్నారు . అన్ని రోడ్లు నీళ్లతో నిండిపోయి ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయని, పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుందని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
దూరంగా ఉన్నవారైతే నాలుగు గంటలుగా రోడ్లమీద ఉన్నామని ఫోన్ చేస్తున్నారు. అన్ని గంటలు వాహనాల్లో ఇరుక్కుపోయిన మహిళల పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు. ఎంత డీజిల్ కాలింది.. దానివల్ల వచ్చే పొల్యూషన్ ఎంత ? వృథా అయిన సమయం ఎంత ? దీనిని పట్టించుకొనే వాడే లేకుండా పోయారు అని మండిపడ్డారు . నియంత్రణ లేక ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టుంది అంటూ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
స్ట్రాటజిక్ రోడ్లు స్ట్రాటజీ లేకుండా వేస్తున్నారా? లోపం ఎక్కడ ఉంది ? అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు వరదల నుంచి ప్రజలను కాపాడడం కోసం, నివారించడం కోసం ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో హైదరాబాద్లో ట్రాఫిక్ దిగ్బంధం నుండి హైదరాబాద్ ప్రజలను విముక్తి చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications