Hyderabad rains: దంచికొడుతున్న వాన; హైదరాబాద్ లో ఎల్లో అలెర్ట్, తెలంగాణాలో ఇలా!!
హైదరాబాద్ లో భారీవర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో, తెలంగాణాలోని పలు జిల్లాలలోనూ ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలలో మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది . కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలతో పాటు, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, భరత్ నగర్, సనత్ నగర్, ఎస్.ఆర్.నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్పేట్, అడ్డగుట్ట, బన్సీలాల్ పేట్, బోయిన్ పల్లి, కుత్బుల్లాపూర్, బేగంపేట, రాణిగంజ్, సికింద్రాబాద్, పద్మారావు నగర్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, కోటి, కాచిగూడ, నారాయణగూడ, రాంనగర్, ఆర్టిసి క్రాస్ రోడ్ ఇలా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి.

జంట నగరాలలో భారీ వర్షాలు
చాలాసేపటినుండి వర్షం కురుస్తున్న క్రమంలో హైదరాబాద్ నగరంలో జనజీవనం స్తంభించింది. గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండగా హైదరాబాద్ సిటీలో మాత్రం గత రెండు మూడు రోజుల నుంచి సాయంత్రం వేళ భారీ వర్షం కురుస్తోంది. కాగా హైదరాబాద్ జంట నగరాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నగరంలో ఎల్లో అలెర్ట్
ఈరోజు సాయంత్రం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని, ఈ క్రమంలో నగరంలో ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ 10వ తేదీ వరకు జంట నగరాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణా వ్యాప్తంగా వర్షాలు
జూన్ 11వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాలలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించవచ్చు అని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది.












Click it and Unblock the Notifications