వాటర్ వేస్ట్ చేస్తున్నారా? అయితే భారీ ఫైన్లకు రెడీగా ఉండండి!
హైదరాబాద్‌లో తాగునీటి వృథాపై జలమండలి కఠిన చర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా విధించింది. నీటిని దుర్వినియోగం చేసినందుకు తాగునీటి కనెక్షన్‌ను తొలగించారు. కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరాను కూడా నిలిపివేశారు. జలమండలి అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు నీటిని వృథా చేస్తే కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరించారు.
ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటి వృథా జరుగుతుంటే ఫొటోలు, వీడియోలతో 99499 30003 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఈ చర్యలు ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో, తాగునీటికి కటకట మొదలైంది. నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు విధించకుంటే భవిష్యత్ లో గుక్కెడు నీళ్ళకు కూడా కష్టం అవుతుంది.

దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఈసారి సుమారు 29 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు 20 శాతానికి పైగా తగ్గాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు నీటి పొదుపుపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రతి కుటుంబం రోజువారీ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని సూచించారు.
తాగునీరు కాని అవసరాలకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వాడాలని కోరారు. నల్లా పైపులకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జలమండలి ఇప్పటికే గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు నవంబర్ 1 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిర్మాణ రంగం, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి పనులకు శుద్ధి చేసిన నీటిని వాడేలా చర్యలు తీసుకుంటోంది. ట్యాంకర్ల సంఖ్య పెంచి, ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నారు.
నగరంలో నీటి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వృథాను అరికట్టడం చాలా అవసరం. వ్యాపార సంస్థలు, ఇళ్లు అందరూ నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్తులో సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ప్రతీ ఒక్కరూ గుర్తిన్చుకోవాల్సిన అంశం నీటి వృథా చేస్తే జరిమానా, కనెక్షన్ కట్ తప్పవు. ప్రజలు కూడా నీటి లీకేజీలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలి. ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో నీటి పొదుపు అందరి బాధ్యత.












Click it and Unblock the Notifications
