తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ మహిళకు చీర.. ఇందిరమ్మ చీరలపై మంత్రి శుభవార్త!
ఇందిరమ్మ చీరల విషయంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ మరో శుభవార్త చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ చీరలు ఇస్తామని ఆయన వెల్లడించారు. నిన్న సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మహిళల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు: మంత్రి పొన్నం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ముఖ్యంగా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాదు మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, బస్సులు ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు.

ప్రతీ మహిళ ఇంటికి ఇందిర మహిళా శక్తి చీరలు
ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన ఆయన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్న ఇందిర మహిళా శక్తి చీరలు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి మహిళా సంఘాల వాళ్ళు చీరలను అందిస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలను అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి ఒకరి ఇంటికి ఇందిరమ్మ చీర వస్తుందని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ చీరల విషయంలో గందరగోళం
చీరల పంపిణీ అనేది ఒక పథకం మాత్రమే కాదని మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి ప్రతీక అని అది మహిళలకు అందించే సారె అని ఆయన అన్నారు. ఆర్థికంగా అతివలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఇదే సమయంలో మహిళలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
రేషన్ కార్డు ఉంటే చీరలు.. మంత్రి ప్రకటనతో గందరగోళం
కచ్చితంగా మహిళా సంఘాలలో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇస్తామని సీతక్క వంటి మంత్రులు ప్రకటన చేస్తుంటే, పొన్నం ప్రభాకర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ చీరలు ఇస్తామని చెప్పడం గందరగోళంగా మారింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ చీరలు ఇస్తామని ప్రకటించడంతో, గ్రామాలలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు తమకు చీరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే ప్రాధాన్యం
మరోవైపు చీరల పంపకాన్ని నిర్వహిస్తున్న వారు మహిళా సంఘంలో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ, డ్వాక్రా గ్రూపులలో లేని మహిళలకు చీరలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఏ మంత్రి చెప్పేది నమ్మాలి అన్నది సందిగ్ధంగా మారింది.












Click it and Unblock the Notifications