తెలంగాణా గ్లోబల్ సమ్మిట్ ..హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులకు ఆహ్వానం.. ఎందుకంటే!
హైదరాబాద్‌లో రానున్న డిసెంబరు 7 నుంచి నిర్వహించనున్న గ్లోబల్ సమిట్‌లో భాగంగా రెండు రోజులపాటు అంతర్జాతీయ వాతావరణ సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తాజాగా సచివాలయంలో ఈ సదస్సు ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే సన్నద్ధత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం, హరిత పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి అంశాలు సదస్సులో ప్రధానంగా చర్చకు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.
దేశ, విదేశాల నిపుణులతో పాటు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొంటున్న హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. కేంద్ర మంత్రులు, నార్వే, డెన్మార్క్, స్వీడన్ వంటి దేశాల రాయబారులను ఆహ్వానించే ప్రతిపాదన కూడా ఉందని ఆయన తెలిపారు. కరవు ప్రభావం ఎక్కువగా ఉండే వర్గాలను ఆదుకోవడం, భద్రత, వ్యవసాయం, ప్రజల జీవనోపాధి వంటి అంశాలపై కూడా సదస్సులో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.

వేసవి కాలంలో పశుగ్రాసం, తాగునీరు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశాన్ని అంచనా వేసి సన్నద్ధం కావాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి నెలకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పినట్లు గుర్తు చేస్తూ, దానికి అనుగుణంగా వ్యూహాలు రూపొందించాలని సూచించారు.
రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన భూగర్భ జలాల పునరుద్ధరణ, సూక్ష్మసేద్యం, నేల సంరక్షణ నమూనాలను సదస్సులో ప్రదర్శించాలని కూడా మంత్రి అన్నారు.తెలంగాణ రాష్ట్రం వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సూక్ష్మసేద్యం విస్తరణ, వర్షపు నీటి నిల్వ పెంపు వంటి కార్యక్రమాలు చేస్తోంది .
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి అంతర్జాతీయ సదస్సులో హరిత పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధన వనరులు, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై ప్రపంచ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుని రాష్ట్ర వ్యూహాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది.
వాతావరణ మార్పులు ఇప్పుడు కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్, ప్రజల జీవనోపాధి అన్నింటిపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఈ సదస్సు కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆచరణాత్మక పరిష్కారాలు, అంతర్జాతీయ సహకారం వైపు దృష్టి సారించాలని అధికారులు ఆశిస్తున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ అంతర్జాతీయ వాతావరణ సదస్సు తెలంగాణకు వాతావరణ పరిరక్షణలో మరో ముందడుగు అని చెప్పవచ్చు.














Click it and Unblock the Notifications
