దేశ, విదేశాల్లో రోడ్‌షోలతో ఇన్వెస్ట్మెంట్స్ కి రెడ్ కార్పెట్.. ఇన్వెస్ట్ తెలంగాణ!
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కోసం దేశవ్యాప్తంగా రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరులలో రోడ్‌షోలు విజయవంతంగా పూర్తయ్యాయి. రాబోయే రోజుల్లో ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగనున్నాయి.
అక్టోబర్ 15న చెన్నైలో జరిగిన రోడ్‌షోలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమిళనాడు పరిశ్రమలతో పోటీ కాదు, భాగస్వామ్యమే లక్ష్యమని చెప్పారు. తిరుప్పూర్ నిట్‌వేర్ పరిశ్రమలు తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో పత్తిని వినియోగించుకోవచ్చని, కోయంబత్తూరు పంపు తయారీదారులు ఉత్తర భారత మార్కెట్‌కు చేరువగా ఉండేందుకు తెలంగాణలో యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.

చెన్నై ఆటో కాంపోనెంట్ సంస్థలు హైదరాబాద్ ఇంజినీర్లతో కలిసి ఈవీ ఎలక్ట్రానిక్స్ రంగంలో పని చేయవచ్చని కూడా ఆయన తెలిపారు. అక్టోబర్ 16న బెంగళూరులో జరిగిన రోడ్‌షోలో మంత్రి శ్రీధర్ బాబు "తెలంగాణ, కర్ణాటక ఒకే వాల్యూ చైన్‌లోని రెండు భాగాలు" అని వ్యాఖ్యానించారు. బెంగళూరులో డిజైన్ చేసిన విమాన ఇంజిన్లు హైదరాబాద్ ఏరోస్పేస్ పార్కుల్లో తయారు కావచ్చని, బెంగళూరు బయోటెక్ ల్యాబ్‌ల్లో ప్రారంభమైన వ్యాక్సిన్‌లు జీనోమ్ వ్యాలీలో పెద్దఎత్తున ఉత్పత్తి చేయవచ్చని వివరించారు.
సెమీకండక్టర్, టెక్స్‌టైల్స్ రంగాల్లో కూడా రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తే దక్షిణ భారతం మరింత బలపడుతుందని అన్నారు. ఇక రాబోయే కార్యక్రమాల్లో అక్టోబర్ 29న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టాప్ సీఈఓలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల అధినేతలతో కలిసి కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా, ఫైజర్, నొవార్టిస్, టెస్లా, సాఫ్రాన్ వంటి సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు.
నవంబర్ 3న ముంబైలో, నవంబర్ 4న అహ్మదాబాద్‌లో కూడా రోడ్‌షోలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా అక్టోబర్ 25లోగా ఆస్ట్రేలియా, దుబాయ్, పశ్చిమాసియా దేశాలు, అమెరికాలో రోడ్‌షోలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గతేడాది జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో ఈసారి మరిన్ని పెద్ద ఒప్పందాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సమ్మిట్ థీమ్ "Your Investment, Our Assurance". పెట్టుబడి పెట్టిన నాటి నుంచి ప్లాట్ కేటాయింపు, ప్లాంట్ ఏర్పాటు, ఉపాధి కల్పన, ఉత్పత్తి వరకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వనుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సమ్మిట్ ల కోసం ప్రభుత్వం ఈ రోడ్‌షోలను నిర్వహిస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాలతో సహకారం, ఉత్తర భారత పెట్టుబడిదారులను ఆకర్షించడం, అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే ప్రయత్నం చేస్తుంది.












Click it and Unblock the Notifications
