ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. 2026కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026కు రిజిస్ట్రేషన్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు జరగనుంది. పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థలు అధికారిక పోర్టల్ invite-itgs2026.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు దశల్లో పూర్తవుతుంది.
పోర్టల్ తెరవడం, వివరాలు నమోదు చేయడం, నిర్ధారణ పొందడం. ముందుగానే నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా ఈ సమిట్‌ను నిర్వహిస్తున్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. గతేడాది జరిగిన సమిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు వచ్చాయి. ఈసారి మరింత విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

సదస్సు నిర్వహణకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్ సభ్యులుగా ఉన్నారు. 25 రంగాలకు సంబంధించిన కార్యనిర్వాహక మండళ్లు ఏర్పాటు చేశారు. వైమానిక, రక్షణ, అంతరిక్ష, జీవశాస్త్రాలు, ఆటోమొబైల్స్, ఐటీ, డేటా సెంటర్లు, ఆహార శుద్ధి, లాజిస్టిక్స్, ఇంధనం, పర్యాటకం, విద్య, ఎలక్ట్రానిక్స్, యానిమేషన్-గేమింగ్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
సదస్సులో ఆరు ఎక్స్‌పో హ్యాంగర్లు 72,250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయం-అనుబంధ రంగాల పెవిలియన్, విద్యా ఎక్స్‌పో, స్టార్టప్ పెవిలియన్, తెలంగాణ పెవిలియన్ ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. తెలంగాణ పెవిలియన్‌లో చేనేత మగ్గం, బతుకమ్మ ఆకృతులు, కాకతీయుల రాతి శిల్పకళ ప్రత్యేకంగా కనిపిస్తాయి.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం శక్తి పెవిలియన్ కూడా ఉంటుంది. వ్యవసాయ పెవిలియన్ 3,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 'పొలం నుంచి భోజనం వరకు' అనే ఇతివృత్తంతో సిద్ధమవుతోంది. మహీంద్రా గ్రూప్‌కు చెందిన అనీష్ షా, ఐటీసీ సంజీవ్ పురి, టీసీఎస్ కె. కృతివాసన్, ఎన్‌విడియా విశాల్ ధూపర్, జీఈ విక్రమ్ రాయ్, అపోలో సంగీతా రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ సతీశ్‌రెడ్డి వంటి పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకరించారు.
స్టార్టప్‌లు ప్రభుత్వ శాఖలు గుర్తించిన సమస్యలకు పరిష్కారాలు అందించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ కింద tisc.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 20 చివరి తేదీ. ఎంపికైన పరిష్కారాలను సమిట్‌లో ప్రదర్శిస్తారు. డిసెంబర్ 7న ప్రారంభోత్సవం రోజున వైమానిక విన్యాసాలు నిర్వహించనున్నారు. ముగింపు సమావేశంలో హామీ నుంచి ఉత్పత్తి వరకు పురోగతి నివేదిక విడుదల చేస్తారు.
డిసెంబర్ 10 నుంచి 13 వరకు సాధారణ ప్రజలు కూడా ప్రదర్శనను తిలకించవచ్చు. సీఎం రేవంత్‌రెడ్డి సమిట్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 'మీ పెట్టుబడికి మా భరోసా' అనే నినాదంతో ఈ సదస్సు రాష్ట్ర ఆర్థిక వికాసానికి కొత్త దిశ చూపుతుందని ఆశిస్తున్నారు.













Click it and Unblock the Notifications
