IBomma Ravi: ఒకడు పోతే మరొకడు-ఇది ఆగదు..! తేల్చేసిన సీవీ ఆనంద్..!
తెలంగాణ పోలీసులు కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని పైరసీతో ముప్పతిప్పలు పెడుతున్న ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా సినీ ప్రముఖులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఇక పైరసీకి చెక్ పడినట్లేనని చెప్పేశారు. ఐబొమ్మ పేరుతో రవి చేసిన అరాచకాల్ని బయటపెట్టారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత రవికి అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజా మద్దతు లభించింది. సినీ పరిశ్రమ మమ్మల్ని దోచుకుటుంటే అడ్డుకోలేని పోలీసులు.. ఇప్పుడు రవిని అరెస్టు చేసి విజయం సాధించినట్లు చెప్పుకోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా అయిన సీవీ ఆనంద్ ఇమ్మడి రవి అరెస్టుతో పైరసీ ఆగిపోతుందా అన్న చర్చతో పత్రికల్లో వచ్చిన ఓ ఆర్టికల్ పై స్పందిస్తూ ఇవాళ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇందులో సీవీ ఆనంద్.. హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి, ఒకడు పోతే మరోడు వస్తాడు, అది కూడా ఇంకా అధునాతనంగా. కొందరిని అరెస్టు చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం ఉటోపియన్ (అసాధ్యమైన ఆశ)అని తేల్చేశారు.

పెద్ద, సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల గ్యాంగ్స్‌ను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, చోరీలు, దాడులు, మోసాలు అన్నీ ఆగిపోయాయా అని సీవీ ఆనంద్ ప్రశ్నించారు. మానవుడు ఉన్నంత కాలం, ఈ రకాల నేరాలు కూడా ఉంటూనే ఉంటాయన్నారు. మన చేతిలో ఉన్నది ఒక్కటే నివారణ అన్నారు. తక్షణంగా డబ్బు సంపాదించాలనే లోభాన్ని తగ్గించుకోవాలని, ఎందుకంటే అదే సైబర్ క్రైమ్ పెరగడానికి మూల కారణమని ఆనంద్ తెలిపారు. తమ సైబర్ స్పేస్, ఖాతాలను రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ప్రమాదాన్ని వెంటనే గుర్తించగలగాలని సూచించారు. చివరిగా "జీవితంలో ఏది కూడా ఫ్రీగా రాదూ" అని రాజమౌళి చెప్పిన మాటే జీవితం యొక్క అసలు నిజం అని ముగించారు.

ఇమ్మడి రవి అరెస్టు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై సానుభూతి వ్యక్తం కావడంతో పాటు పైరసీ విషయంలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ భారీగా రేట్లు పెట్టి ప్రేక్షకుల్ని దోచుకుంటున్న సమయంలో రవి లాంటి వారు ఐబొమ్మ ద్వారా వినోదాన్ని ఉచితంగా ఇంటికే చేర్చాడన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో రవి అరెస్టుతో పైరసీ ఆగదంటూ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications