ఉపాధి హామీ పనికెళ్లిన ఐఆర్ఎస్ అధికారి.. కూలీలతో కలిసి అలా.. హ్యాట్సాఫ్ సర్!!
సాధారణంగా ఎటువంటి ఉపాధి లేని వారి కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎలాంటి ఉద్యోగం లేని ఖాళీగా ఉండేవారు ఉపాధి హామీ పనులకు వెళ్లి ఉపాధి కల్పించుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ గ్రామంలో ఓ ఐఆర్ఎస్ అధికారి ఉపాధి హామీ కూలీగా మారారు. ఎందుకు ఆయన ఉపాధి హామీ కూలీ అయ్యారో తెలుసుకోవాలంటే ఈ కథనం పై ఓ లుక్కెయ్యండి.
ఉపాధి హామీ కూలీగా మారిన సివిల్ సర్వెంట్
సూర్యాపేట జిల్లాలో ఒక ఐఆర్ఎస్ అధికారి ఉపాధి హామీ కూలీలతో కలిసి పని చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ కు చెందిన సందీప్ బాగ ఐఆర్ఎస్ అధికారిగా బెంగళూరు సౌత్ సెంట్రల్ టాక్స్ కమిషనరేట్ లోని జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులను డీల్ చేసే ఆయన పన్ను ఎగవేసే వారి నుండి పన్ను రికవరీ చేయడానికి కీలకంగా పనిచేస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో ఐఆర్ఎస్ అధికారి ఉపాధి హామీ పని
భారత ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచగలిగే బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామాన్ని సందర్శించిన సందీప్ బాగ ఆ గ్రామంలో ఉపాధిహామీ కూలీలతో కలిసి ఒకరోజు పని చేశారు. దీనికోసం ఆయన ఎటువంటి వేతనం తీసుకోలేదు. సామాన్య ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, వారితో కలిసి పనిచేసిన అనుభూతిని పొందడానికి ఐఆర్ఎస్ అధికారి సందీప్ ఉపాధి హామీ పనులు చేసినట్టుగా సమాచారం.
కూలీలతో కలిసి పని చేసిన తర్వాత ఆయన చేసిందిదే
ఇక భోజన విరామ సమయంలో కూడా కూలీలతో కలిసి భోజనం చేసిన ఆయన పని పూర్తయిన తర్వాత ప్రభుత్వ పథకాల పైన కూలీలకు అవగాహన కల్పించారు. మహిళలకు ఉన్న ఎన్నో స్వయం ఉపాధి పథకాల గురించి వివరించారు. అంతేకాదు తనతో పాటు ఆ రోజు ఉపాధి హామీ పనులు చేసిన 152 మంది కూలీలకు 200 రూపాయల వేతనాన్ని సందీప్ తన నెలవారీ జీతం నుంచి చెల్లించారు .
హ్యాట్సాఫ్ సర్ అంటూ కితాబు
చివరిగా అందరితో కలిసి బతుకమ్మ ఆడారు. ఇక ఇదంతా విన్నవారు ఓ సివిల్ సర్వెంట్ రోజంతా సాధారణ కూలీగా సామాన్యులతో కలిసి పని చేయడాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలాగే అందరు అధికారులు సామాన్యుల కష్టాలను తెలుసుకుంటూ వారి పురోగతికి మార్గాలు చూపాలని అంటున్నారు. హాట్సాఫ్ సార్ అంటూ ఆ సివిల్ సర్వెంట్ కు కితాబిస్తున్నారు.












Click it and Unblock the Notifications