బండి సంజయ్ అరెస్ట్.. వరంగల్ సీపీ తీరు హాట్ టాపిక్
వరంగల్ పోలీస్ కమిషనర్ గా వరంగల్ కమిషనరేట్ కు వచ్చిన ఏ.వి రంగనాథ్ తీరుపై ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. నేరస్థులు ఎవరైనా, ఎంతటి వారైనా నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి అరెస్టు చూపించి, జైలుకు పంపించే వరంగల్ సిపి రంగనాథ్ ఇప్పుడు బండి సంజయ్ ని కూడా అరెస్టు చూపిస్తారా? అన్నది అటు రాజకీయ వర్గాలలోనూ, ఇటు మీడియా వర్గాలలోనూ ఆసక్తికర చర్చగా మారింది.
వరంగల్ సీపీగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అక్రమార్కులకు సింహ స్వప్నంగా మారిన వరంగల్ పోలీస్ బాస్ భూ కబ్జాలు చేసిన, భూ ఆక్రమణలకు పాల్పడిన, భూ వివాదాలలో తల దూర్చిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతేకాదు భూవివాదాలలో తల దూర్చిన పోలీసులను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
ఇక తాజాగా పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ రిపోర్టర్ బూరం ప్రశాంత్ ను సైతం అరెస్టు చూపించి, జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి చేసినా చట్టం తన పని తాను చేసుకోపోతుందని తేల్చి చెప్పారు.

ఇక ఇదే సమయంలో తాజాగా బండి సంజయ్ ను పేపర్ల లీకేజీ కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో, బండి సంజయ్ ని కూడా అరెస్టు చూపిస్తారా? అన్నది ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా మారింది.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వరంగల్ సిపి ప్రెస్ మీట్ నిర్వహించనున్న నేపథ్యంలో అందరిలోనూ ఇదే అనుమానం వ్యక్తం అవుతుంది.బండి సంజయ్ కు సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారంలో కీలక ఆధారాలు ఉన్నాయని, ఈ క్రమంలో ఆయనను సైతం అరెస్టు చూపించి, కోర్టు ముందు హాజరు పరుస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఇప్పటికే బండి సంజయ్ కు పాలకుర్తిలో వైద్య పరీక్షలు నిర్వహించి వరంగల్లో కోర్టులో హాజరు పరచడానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మూడు గంటలకు సిపి ప్రెస్ మీట్ పెట్టడం అందరిలోనూ ఉత్కంఠకు కారణంగా మారింది.
ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చూపించే అవకాశం ఉందా? అన్న చర్చ కూడా జరుఉతుంది. సంచలనాలకు కేరాఫ్ అయిన వరంగల్ సి పి ఎంపీ బండి సంజయ్ విషయంలో ఏం చెప్పబోతున్నారు? ఏం చేయబోతున్నారు అన్నది? అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications