Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్
అర్ధరాత్రి సమయం.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-1లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. అంతలో ఒక విలాసవంతమైన 'బీఎండబ్ల్యూ' (BMW) కారు దర్జాగా దూసుకొచ్చింది. రొటీన్ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆ కారును ఆపారు. కానీ, ఆ కారు డోర్ తెరిచిన తర్వాత వెలుగు చూసిన విషయాలు చూసి ఖాకీలకే చెమటలు పట్టాయి!
కారు నడుపుతున్న వ్యక్తికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా.. ఆల్కహాల్ స్థాయి ఏకంగా 137గా నమోదైంది. ఇక్కడి వరకు అంతా మామూలే అనుకున్న పోలీసులకు.. కారు నంబర్ ప్లేట్లను గమనించినప్పుడు అసలు షాక్ తగిలింది. ఆ వాహనానికి ముందు భాగంలో ఢిల్లీ రిజిస్ట్రేషన్ (DL 6CM 7097) ఉండగా, వెనుక మాత్రం తెలంగాణ నంబర్ (TS 09 FQ 9999) మెరుస్తోంది. ఇదేం విచిత్రం అని పోలీసులు ఆరా తీయగా.. నిందితుడు గౌతమ్ పొంతన లేని సమాధానాలు చెబుతూ వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.

మ్యాజిక్ బటన్.. నంబర్ ప్లేట్ గుట్టురట్టు!
పోలీసులు కారును క్షుణ్ణంగా పరిశీలించగా.. స్టీరింగ్ పక్కనే ఒక రహస్య బటన్ కనిపించింది. ఆ బటన్ నొక్కగానే పోలీసులు కళ్లు బైర్లు కమ్మే సీన్ కనిపించింది. ఒక్క క్లిక్‌తో కారు ముందు, వెనుక ఉన్న నంబర్ ప్లేట్లు ఆటోమేటిక్‌గా ఫ్లిప్ అవుతూ మారిపోతున్నాయి! అంటే.. పోలీసుల కళ్లు గప్పి, చలానాల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు కారులో ఒక ప్రత్యేకమైన 'ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ చేంజింగ్' టెక్నాలజీని అమర్చుకున్నాడు. నగర చరిత్రలోనే ఇలాంటి టెక్నాలజీని పట్టుకోవడం ఇదే మొదటిసారి అని పోలీసులు వెల్లడించారు.
చలానాల భయం.. అందుకే ఈ స్కెచ్!
నిజానికి ఆ కారు అసలు నంబర్ DL 6CM 7097. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు కెమెరాలకు దొరక్కుండా ఉండేందుకు, ఆ ఫేక్ నంబర్ ప్లేట్ టెక్నాలజీని గౌతమ్ వాడుతున్నట్లు తేలింది. డ్రంకెన్ డ్రైవ్ కేసుతో పాటు, ఫోర్జరీ మరియు పోలీసులను మోసం చేసినందుకు జూబ్లీహిల్స్ పోలీసులు గౌతమ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ కిలాడీ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సినిమా స్టైల్లో తప్పించుకోవాలనుకున్న గౌతమ్ ప్లాన్.. చివరకు జూబ్లీహిల్స్ పోలీసుల చాకచక్యంతో అడ్డం తిరిగింది. ఇప్పుడు ఆ 'మ్యాజిక్' కారు పోలీస్ స్టేషన్‌లో మూలుగుతోంది












Click it and Unblock the Notifications