వాళ్ళను చెప్పుతో కొట్టాలి: కేసీఆర్ వి డ్రామాలు: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తుంటే, ఆయా పార్టీల అధ్యక్షులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ ల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బిజెపి రెండూ ఒకటేనని చేస్తున్న ప్రచారం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి, బీఆర్ఎస్, బిజెపి ఒకటే అని చెబుతున్న వారిని చెప్పులతో కొట్టాలని ఘాటుగా స్పందించారు. ఎట్టి పరిస్థితులలోనూ తాను ఎవరితోనూ కలిసేది లేదని, ఆయన తేల్చి చెప్పారు.

రాష్ట్ర ప్రజలు BRS, కాంగ్రెస్ లకు లొంగకుండా కేంద్రంలో BJP నాయకత్వంలో ప్రభుత్వ పనితీరు చూసి, ఎలాంటి పొరపాటు లేకుండా ఓటు వినియోగించుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు . BJP ని ఓడించటానికే కాంగ్రెసు, BRS, MIM కలసి పనిచేస్తున్నాయని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయనీ ఆరోపించారు.
కాంగ్రెస్ హామీలు అమలుచేయాలంటే, ప్రస్తుతం ఉన్న బడ్జెట్ కు మూడు రెట్లు ఎక్కువ నిధులు కావాలని, మైనారిటీ ఓట్లకోసమే రాజ్యాంగ విరుద్ధమైన హామీలు ఇస్తున్నారనీ ఆరోపించారు. BJP కుల,మత, ప్రాంతాలకు అతీతంగా హామీలిస్తోందనీ, ఇచ్చిన మాటను తప్పక అమలు చేస్తుందని అన్నారు. BJP అధికారంలోకి రాగానే, హైదరాబాద్ ను భాగ్యనగరంగా పేరు మారుస్తామని ఆయన చెప్పారు.
మద్రాస్ ను చెన్నైగా, కలకత్తాను కోల్ కత్తాగా , బాంబే పేరు ముంబైగా మార్చినపుడు... హైదరాబాద్ పేరు మార్చడంలో తప్పులేదని ఆయన పేర్కొన్నారు. రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా మార్చామనీ, ఇది ఎవ్వరికీ వ్యతిరేకం కాదనీ, బానిస మనస్తత్వానికి ప్రతీకలను తొలగించామని ఆయన వివరించారు. హైదరాబాద్ ను భాగ్య నగరంగా మార్చి తీరుతామని స్పష్టం చేశారు.
రైతుబంధు నుండి నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కావాలని డ్రామాలు ఆడుతుందని, నిజంగానే రైతుల పైన ప్రేమ ఉంటే, వారికి రైతుబంధు ఇవ్వాలి అనుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రైతుబంధు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. నేరుగా గెలిచే సత్తా లేక రైతులు, ప్రజలను మభ్యపెడుతూ చీప్ ట్రిక్స్ చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications