తెలంగాణా సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖలు!!
బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నిన్న కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన కిషన్ రెడ్డి, నేడు రెండవ లేఖను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజాగా రాసిన లేఖలో కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని BRS నాయకత్వం రూపుమాపుతోందని, వారి కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి ఎన్నికల్లో ప్రజలే సరైన పాఠం నేర్పిస్తారని పేర్కొన్నారు. BRS అధినేత, ముఖ్యమంత్రి K చంద్రశేఖర్ రావు కు రెండో బహిరంగ లేఖను కిషన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు.

అధికార వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ, అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. BRS అధినేత దృష్టిలో ప్రజలంటే అమాయకులనీ, ప్రజాసమస్యల గుండె చప్పుడుకు- తెలంగాణ గొంతుకకు- భావస్వేచ్ఛకు వేదికైన ధర్నాచౌక్‌ను ఎత్తి వేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఇక నిన్నటికి నిన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడరని పేర్కొన్న కిషన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కెసిఆర్ మాట తప్పారని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కెసిఆర్ మాట చెబితే చేస్తాడని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన మీరు అధికారంలోకి రాగానే ఎందుకు మీ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
దళితులకు లేనిపోని ఆశలు కల్పించిన మీ తీరు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని తెలుసుకునేందుకు చాలా సమయం పట్టిందని కిషన్ రెడ్డి దళితులను కేసీఆర్ ఏ విధంగా మోసం చేశారో అన్ని ఉదాహరణలతోనూ పేర్కొన్నారు. ఇక బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణకు తొలి బీసీ ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటిస్తే మీ సుపుత్రుడు కులం ముఖ్యం కాదు గుణం అంటూ ప్రకటనలు చేస్తున్నాడన్నారు.
ఇది బీసీల పట్ల మీ కుటుంబానికి ఉన్న గౌరవానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మోసం చేసి కెసిఆర్ మాట నీటి మూట అని నిరూపించారని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజానీకం వాస్తవాలను గ్రహిస్తుందని ,ఇక అది మీ కుటుంబం జీర్ణించుకోలేక పోతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అప్రజాస్వామిక పరిపాలన సాగించారో బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications