మరో వివాదంలో కొండా సురేఖ..దరిద్రం ఎందుకో ఆమెనే వెంటాడుతోంది
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వేళ, వరంగల్‌లో జరిగిన అధికారిక వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో, మంత్రి కొండా సురేఖ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పొరపాటున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
సోమవారం వరంగల్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2న జరుపుకునే వేడుకల్లో జనవరి 26న జరుపుకునే గణతంత్ర దినోత్సవాన్ని ప్రస్తావించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి పదవిలో ఉన్న ఒక సీనియర్ నాయకురాలికి ఈ రెండు ముఖ్యమైన దినోత్సవాల మధ్య తేడా తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మర్చిపోయి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొండా సురేఖ చేసిన పొరపాటుపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను ట్రోల్ చేస్తుండగా, మరికొందరు అధికారిక వేదికలపై మాట్లాడేటప్పుడు నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో ఆమె చేసిన ఆరోపణలు పరువు నష్టం దావాకు దారి తీశాయి. గత ఏడాది దసరా ఫ్లెక్సీల వివాదంలో కొండా వర్గీయుల అరెస్టు, మంత్రి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం సంచలనం సృష్టించింది. వేములవాడ రాజన్న కోడెల వివాదం, మంత్రి అనుచరుడిపై కేసు నమోదు కావడం కూడా గత ఏడాది డిసెంబర్‌లో చర్చనీయాంశమైంది.
తాజాగా, పైసలిస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియరవుతాయి అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ కమీషన్ల సర్కార్ అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే, తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తాను గత బీఆర్ఎస్ మంత్రులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని కొండా సురేఖ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications