కేటీఆర్ వ్యాఖ్యల దుమారం.. హన్మకొండలో ఉద్రిక్తత!
హనుమకొండ నయీమ్ నగర్ బ్రిడ్జి వద్ద నేడు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన చిచ్చు హన్మకొండ నయీం నగర్ బ్రిడ్జి పైన వివాదానికి కారణంగా మారింది. హనుమకొండలోని నయీమ్ నగర్ బ్రిడ్జి విషయంలో మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ తాము బ్రిడ్జి కడితే ఇప్పుడున్న ఎమ్మెల్యే పూలాభిషేకాలు చేయించుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేటీఆర్ కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్
ఇక ఈ వ్యాఖ్యలపైన స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన నయీంనగర్ బ్రిడ్జి పైన మీడియాసమావేశం నిర్వహించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. కేటీఆర్ నిజమైన పొలిటీషియన్ అయితే నయీమ్ నగర్ బ్రిడ్జి వద్దకు బహిరంగ చర్చకు రావాలని నిన్న ఆయన పేర్కొన్నారు. తాను ఆధారాలతో సహా వస్తానని సవాల్ విసిరారు. పదేళ్ళు అధికారంలో ఉన్నా ఎందుకు నయీంనగర్ బ్రిడ్జ్ పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు.

నయీం నగర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత
ఇక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరిన నేపథ్యంలో నేడు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నయీమ్ నగర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు బ్రిడ్జి వద్దకు చేరుకుని దాస్యం వినయ్ భాస్కర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ శ్రేణుల అరెస్ట్, రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను విడదీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు బిఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల తీరు పైన దాస్యం వినయ్ భాస్కర్ ఆందోళన వ్యక్తం చేస్తూ నయీం నగర్ బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారి పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు.
మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
దీంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ని సైతం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నయీం నగర్ బ్రిడ్జిని తామంటే తాము నిర్మించామంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకరిని మించి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్ది పార్టీలను టార్గెట్ చేస్తున్న కారణంగా హనుమకొండ నయీమ్ నగర్ బ్రిడ్జి పైన స్థానికంగా రగడ కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications