బీఆర్ఎస్‌కు తొలిసారి గడ్డు పరిస్థితి: రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఏమన్నారంటే?
బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్‌దో, కేటీఆర్‌దో కాదని.. ఇది తెలంగాణ ప్రజల గొంతుక అని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. కేసీఆర్ నాయకత్వం, గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్, బీజేపీలతో జాగ్రత్తగా ఉండాలన్నారు కేటీఆర్. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. అనేకమంది విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులుగా చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పదవిని కాపాడుకునే పనిలో ఉన్నారన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. పోరాటాలు మనకు కొత్తకాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. 12 వేల మంది ఆశా వర్కర్లతో పెద్ద సభ నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ ఇచ్చిన జీవో 55ను రద్దు చేసి జీవో 29ను తెచ్చారన్నారు. జీవో 29 వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. నవంబర్ 5న జరగనున్న ఆటో డ్రైవర్ల ధర్నాకు మద్దతు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో బాధపడని వారు లేరన్నారు.
32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వీ సమావేశాలు జరగాలి. ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో క్రియాశీలక పాత్ర పోషించాలి. కేసులకు భయపడొద్దు.. లీగల్ సెల్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు. విద్యార్థి నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. బీఆర్ఎస్వీ లేని కాలేజీ ఉండొద్దు. విద్యార్థి నాయకులకు రాజకీయంగా అవకాశాలు ఇస్తాం. మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు ఇతర పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై చేసిన విమర్శలపై కేటీఆర్ స్పందించారు. మూసీపై శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని తెలిపారు. మూసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులు, మూసీ పునరుజ్జీవనం కోసం చేసిన ప్రయత్నాలు, ప్రణాళికలు వివరిస్తామని కేటీఆర్ చెప్పారు. మూసీ నది ప్రక్షాళనపై రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications