తెలంగాణాలో నేడు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. ఈ జిల్లాలలోనే.. ఐఎండీ అలెర్ట్!!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో నిన్న ఒక మోస్తారు వర్షపాతం నమోదయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.
కాగా తాజాగా భారత వాతావరణ శాఖ నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని బులిటెన్ ద్వారా వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో నేడు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిన్న రాత్రి విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. అయితే నేడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వేగం ఉంటుందని పేర్కొంది. పశ్చిమ విదర్భ నుండి విస్తరించిన ద్రోణి ఉత్తర తెలంగాణ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ, ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉండడంతో ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
దీని ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ మరియు జనగామ జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆపై ఎల్లుండి నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని బులిటెన్ లో పేర్కొంది. ఇక నేడు, రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications