చోరీ ఘటన మరువకముందే.. బొల్లారం మద్రాస్ రెజిమెంట్ క్యాంపు సమీపంలో 160 డిటోనేటర్లు.. ఆందోళన!
హైదరాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్ లో ఆయుధాల చోరీ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ బొల్లారం ప్రాంతంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపు సమీపంలో ఎలక్ట్రికల్ డిటోనేటర్లు బయటపడటం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ పరిణామాలు భద్రతా వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేలా చేసింది.
గోడ వెనుక 8 బండిల్స్‌లో మొత్తం 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లను గుర్తించిన ఆర్మీ సిబ్బంది
బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ దగ్గర ప్లాస్టిక్ బకెట్‌లో 8 బండిల్స్‌లో మొత్తం 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లను ఆర్మీ సిబ్బంది గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ డిటోనేటర్లు అక్కడ వదిలి వెళ్లింది ఎవరో అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. మల్కాజిగిరి బాంబ్ డిస్పోజల్ టీమ్ సూచనల మేరకు ఆ డిటోనేటర్లను సురక్షితంగా భద్రపరిచారు.

రెండు రోజుల క్రితమే ఆయుధాల చోరీ ఘటన
వాటి విలువ సుమారు 32 వేల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఘటన ఆయుధాల చోరీ కేసు నేపథ్యంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. కేవలం రెండు రోజుల క్రితమే అదే మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాలు భద్రపరిచే గది తాళం పగులగొట్టి 12 ఆయుధాలు దొంగిలించబడ్డాయి. అందులో నాలుగు ఏకే-47లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి.
కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట చోరీతో పాటు బయటపడిన డిటోనేటర్లు
ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్రాస్ రెజిమెంట్ క్యాంపు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కింద నడుస్తుంది. అనుమతి ఉన్నవారు మినహా ఎవరూ లోనికి ప్రవేశించలేరు. అయినప్పటికీ ఆయుధాల చోరీ జరగడం, దాని తర్వాత వెంటనే డిటోనేటర్లు బయటపడటం రక్షణ దళాల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. పోలీసులు ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందా అనే అంశంపై కూడా దృష్టి సారించారు.
గోప్యంగా పోలీసుల దర్యాప్తు
కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ దళాల శిక్షణ సంస్థలు పనిచేస్తున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళనకరం అని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తును గోప్యంగా కొనసాగిస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయుధాలు, డిటోనేటర్లు ఎలా బయటికి వచ్చాయి, ఎవరి చేతుల్లోకి వెళ్లాయి అనే వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.














Click it and Unblock the Notifications