మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా విష్ణు, మనోజ్ బౌన్సర్లు.. హై టెన్షన్!
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయితీ ఉద్రిక్తంగా మారుతుంది . జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద పోటా పోటీగా బౌన్సర్లు చేరుకోవడంతో హై టెన్షన్ చోటుచేసుకుంది. మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు ఇంటికి చేరుకున్నారు. ఇక పోటీగా మరో 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ కూడా రంగంలోకి దించారు. అయితే మనోజ్ తరఫున వచ్చిన బౌన్సర్లను సెక్యూరిటీ లోనికి అనుమతించలేదని సమాచారం.
మోహన్ బాబు ఇంటికి మంచు లక్ష్మి, విష్ణు
మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవ జరిగిన సమయంలో మంచు విష్ణు దుబాయ్ లో ఉన్నాడు. ఇక దుబాయ్ నుండి మంచు విష్ణు కూడా ఇంటికి చేరుకున్నాడు. మరోవైపు ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటికి చేరుకుంది . దీంతో ఈరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరగబోతుంది అన్నది అందరిలో టెన్షన్ రేకెత్తిస్తుంది.

మోహన్ బాబు ఫ్యామిలీ ఆస్తుల గొడవ
మోహన్ బాబుకు మంచు మనోజ్ కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్టు ఈ గొడవల భాగంగా మోహన్ బాబు అనుచరులు వినయ్ ఇతర బౌన్సర్లు మంచు మనోజ్ పైన ఆయన భార్య మౌనిక పైన దాడికి పాల్పడి గాయపరిచినట్టు దీంతో వారు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు నిన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది.
డయల్ 100కు కాల్.. పోలీసులు చెప్పిందిదే
కాగా నిన్న మోహన్ బాబు ఇంటి నుండి డయల్ 100 కు కాల్ వచ్చిందని ఇంట్లో గొడవ పైన సమాచారం మాత్రమే ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. అయితే వ్యక్తిగతంగా ఎవరు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. డయల్ 100 కు కాల్ రావడంతో పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లారని, అయితే తమ కుటుంబ సమస్యగా చెప్పి పోలీసులను మోహన్ బాబు ఫ్యామిలీ పంపించేసారని పేర్కొన్నారు.
నడవలేని స్థితిలో మంచు మనోజ్ .. ఆస్పత్రిలో చికిత్స
ఇది ఇలా ఉంటే నిన్న సాయంత్రం మంచు మనోజ్ ఒంటిపైన అనుమానాస్పదమైన దెబ్బలతో నడవలేని స్థితిలో బంజారాహిల్స్ లోని ఒక ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. కాలు మెడ భాగంలో గాయాలు అయినట్టు వైద్యులు నిర్ధారించి 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని సూచించారు. అయితే మళ్ళీ ఈరోజు వస్తానని మంచు మనోజ్ డిశ్చార్జ్ అయ్యారు.
భారీగా మోహన్ బాబు ఇంటివద్ద బౌన్సర్లు.. హై టెన్షన్
మెడికో లీగల్ కేసు కావడంతో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నేడు మోహన్ బాబు ఇంటికి వెళ్లి మంచు మనోజ్ నుంచి అతనికి తగిలిన గాయాలు తాలూకు వివరాలను సేకరించనున్నారు. ఇక ఇదే సమయంలో ఓవైపు విష్ణు, మరోవైపు మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటికి చేరుకోవడంతో భారీగా బౌన్సర్లు కూడా రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది. దీంతో మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్ చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications