కంకరలో కూరుకుపోయిన TGSRTC బస్సు: నలిగిన ప్రయాణికులు
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 20 మందికిపైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఈ తెల్లవారు జామున జిల్లాలోని చేవెళ్ల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తోన్న టీజీఎస్ఆర్టీసీ బస్సు నంబర్ టీఎస్ 34 టీఏ 6354 ఎక్స్ ప్రెస్ బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఖానాపూర్ గేట్- మీర్జాగూడ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన నంబర్ టీజీ 06 టీ 3879 భారీ టిప్పర్ బస్సును వేగంగా ఢీకొట్టింది. కంకర లోడ్ తో వెళ్తోన్న టిప్పర్ అది.

బస్ డ్రైవర్ హారన్ మోగిస్తూ, హెడ్ లైట్లను వెలిగిస్తూ హెచ్చరిస్తోన్నప్పటికీ రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. టిప్పర్ ను తప్పించడానికి డ్రైవర్ కుడి వైపు బస్సును తిప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి బస్సు కుడి వైపు భాగం మొత్తం కోసుకుపోయింది. బస్సు ముందు భాగం, డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్, ప్రయాణికులను వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.
ఢీకొట్టిన తర్వాత టిప్పర్ బస్సుపై వాలిపోయింది. అందులో ఉన్న కంకర మొత్తం బస్సులో పడింది. దాని మధ్య పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. 17 మంది సంఘటన స్థలంలోనే మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణం విడిచారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఢీ కొట్టిన అదుపు తప్పి.. బస్సుపై పూర్తిగా ఒరిగిపోయిందా టిప్పర్. ఫుల్ లోడ్ కంకరతో ఉన్న టిప్పర్ కావడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. టిప్పర్ బస్సుపై ఒరిగిపోవడం వల్ల అందులో ఉన్న కంకర మొత్తం బస్సులోకి ఉప్పెనలా వచ్చిపడింది. కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై కంకర లోడ్ మొత్తం పడింది. అందులో చిక్కుకుని, ఊపిరి ఆడని స్థితిలో మరికొందరు ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.












Click it and Unblock the Notifications