మేడారం మహాజాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం... ఎప్పటినుండంటే
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, విగ్రహాలు లేని విశిష్టమైన జాతర, గిరిజన దేవతలను ఆరాధించే గొప్ప జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తేదీలను ఖరారు చేశారు పూజారులు. తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే సంవత్సరం జరగబోతుందని అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మేడారం మహా జాతర తేదీలు ఖరారు
ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహా జాతర జరగనుండగా, మేడారం మహా జాతరను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ప్రణాళికాబద్ధంగా ముందు నుంచే తేదీలను ప్రకటించి మరీ ఏర్పాట్లు చేస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జాతర జరగనుందని మేడారం సమ్మక్క సారలమ్మల పూజారుల సంఘం ప్రకటించింది.

మేడారం జాతర షెడ్యూల్ ఇలా
జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెల మీదకు తీసుకువస్తారు. ఆపై జనవరి 29న సమ్మక్కతల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటుంది. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుందని గిరిజన పూజారుల సంఘం ప్రకటనలో పేర్కొంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుందని, జాతరకు సంబంధించిన వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ఇప్పటినుంచే మేడారం మహాజాతరకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తారు.
మేడారం జాతరకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి భక్తులు
మేడారం మహా జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కోట్లాదిగా భక్తులు వచ్చి అమ్మవార్లకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం మహా జాతర సమయంలో మేడారం ప్రాంతమంతా జన సంద్రంలా తలపిస్తుంది.
జనవరి చివరివారంలోనే మేడారం మహా జాతర
మేడారం మహా జాతరను ప్రతి రెండేళ్లకు ఒకసారి అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్ల మధ్య అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది. ఈసారి జనవరి చివరివారంలోనే మేడారం మహా జాతర రానున్న నేపధ్యంలో ఇప్పటినుండే హడావిడి ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications