మేడారంలో న్యూజిలాండ్ "మావోరి తెగ" .. మంత్రి సీతక్కతో కలిసి "హాకా" నృత్యం !!
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సమయం ఆసన్నమైంది. జనవరి 28 నుంచి 31 వరకు ఈ మహా జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఈ మహా జాతరకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లను ప్రభుత్వం సమకూర్చింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ (Maori Tribes) ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దెల ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ నృత్యమైన "హాకా" నృత్యాన్ని ప్రదర్శించారు.
కాగా హాకా నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ముఖభావాలు, శరీర చలనలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. అంతే కాకుండా హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని పెంచారు. మేడారం సందర్శించేందుకు తమ బృందం పట్ల ప్రత్యేక చొరవ చూపినందుకు మావోరి తెగ ప్రతినిధులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని అన్నారు. ఆదివాసీ జీవన విధానం, విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం మావోరి తెగ ప్రతినిధులను గద్దెలా వద్దకు తీసుకెళ్లి వన దేవతల దర్శనం చేయించారు. అంతే కాకుండా సమ్మక్క-సారలమ్మ వన దేవతల వైభవం, చరిత్రను మంత్రి సీతక్క స్వయంగా వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వన దేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారు.
ఇక జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరనున్నారు. జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోనున్నారు. జనవరి 31న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మూడో రోజైన జనవరి 30న సమ్మక్క, సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రోజు దేశం నలుమూలల నుంచి భక్తులు విపరీతంగా తరలి వచ్చి బంగారం, వెండి, జుట్టు, కోడిపుంజులు, తేనె, చెల్లింపు డబ్బులు వంటి విభిన్న రకాల మొక్కులు సమర్పిస్తారు.













Click it and Unblock the Notifications