సుజనా చౌదరికి కేంద్రం బిగ్ షాక్
హైదరాబాద్: భారతీయ జనత పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దయినట్లు తెలుస్తోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం. ఈ విద్యా సంవత్సరంలో ఈ వైద్య కళాశాలలో సీట్లను భర్తీ చేయకూడదని ఆదేశించినట్లు చెబుతున్నారు.
సుజనా చౌదరికి చెందిన వైద్య కళాశాల మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మేడ్చల్ జిల్లాలోని ఘన్‌పూర్‌లో ఉంది ఇన్‌స్టిట్యూట్. 2002లో దీన్ని ఏర్పాటు చేశారు. అదే సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఇన్‌స్పెక్షన్‌గా నిర్ధారించారు. ట్రస్ట్ రూపంలో దీన్ని నిర్వహిస్తోంది ఆ వైద్య కళాశాల యాజమాన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్శిటీ ఆధీనంలో కొనసాగింది.

రాష్ట్ర విభజన తరువాత వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్శిటీ పరిధిలోకి చేరింది. ప్రతి విద్యా సంవత్సరంలో మొత్తంగా 150 సీట్లను భర్తీ చేసుకోవడానికి వీలు ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్ ఇన్ టేక్ 150. 2002 నుంచి 2017 వరకు ప్రతి విద్యా సంవత్సరంలో 100 సీట్లను భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.
2017 ఫిబ్రవరిలో మెడిసిటీ మెడికల్ కాలేజీ సీట్ల సామర్థ్యం పెరిగింది. 100 సీట్లకు అదనంగా మరో 50 సీట్లను మంజూరు చేసింది ఎంసీఐ. డిగ్రీ కింద ఈ 50 సీట్లను కూడా ఈ ఇన్‌స్టిట్యూట్‌కు మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ ఇన్‌స్టిట్యూట్ గుర్తింపును రద్దు చేసినట్లు ఎంసీఐ ప్రకటించినట్లు తెలుస్తోంది. నేషనల్ కౌన్సిల్ యాక్ట్- 2019లోని 26 క్లాజ్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లను నిలిపివేయాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి గల కారణాలు స్పష్టంగా తెలియరావట్లేదు. దీనితో త్వరలోనే కాళోజీ నారాయణ రావు మెడికల్ యూనివర్శిటీ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ గుర్తింపు రద్దు కావడం వల్ల తెలంగాణ 100 మెడికల్ సీట్లను కోల్పోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ఇతర మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలో సర్దుబాటు చేయొచ్చనే అంచనాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications