New Ration Cards: మీ సేవ దరఖాస్తుల్లో అసలు ట్విస్ట్ ఇదే!
పలు ప్రకటనలతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణపై గందరగోళం నెలకొంది. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించాలని సంబంధిత ప్రభుత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని శుక్రవారం ప్రకటనలు వెలువడ్డాయి. అయితే, దీనిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ శనివారం స్పష్టతనిచ్చింది.
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులే ఇవ్వలేదని పౌరసరఫరాల శాఖ తాజాగా వెల్లడించింది. ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలని 'మీ సేవ'ను కోరినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.

శుక్రవారం మీ సేవలో దరఖాస్తులు చేసుకోవచ్చనే వార్తలు రావడంతో.. శనివారం ఉదయం నుంచే ప్రజలు మీ సేవ కేంద్రాల వద్దకు బారులు తీరారు. దరఖాస్తులు చేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో గందరగోళం తలెత్తింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ నిలిపివేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిలిపివేయలేదని, పౌరసరఫరాల శాఖ గానీ, మీ సేవ కానీ తమను సంప్రదించలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజాగా, మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. అయితే, మార్పులు, చేర్పుల కోసం మీ సేవ ద్వారా ఇప్పటికే దరఖాస్తులు అందుతున్నాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. పలు ప్రకటనలతో ఆందోళనలకు గురవుతున్న ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని తెలియజేసేందుకు తాజాగా పౌరసరఫరాల శాఖ స్పందించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications