కేసీఆర్ తర్వాత నేనే సీనియర్.. ఎలాగో చెప్పిన మంత్రి ఎర్రబెల్లి!!
కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. ఆమధ్య ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని, వారిని మారిస్తే మళ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉంటుందని సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి. బీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా మళ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ తర్వాత తానే సీనియర్ నంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అంటూ చెప్పుకొచ్చిన ఆయన గత 30 సంవత్సరాలుగా వరుస విజయాలతో సీనియర్ ఎమ్మెల్యేగా రాజకీయాలలో రాణిస్తున్నానని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 1987-1988 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. తాను డాక్టర్ అవ్వాలని అనుకునేవాడినని కానీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు.

ఏ రంగంలో రాణించాలి అన్నా కృషి, పట్టుదల అవసరం
ఎవరు ఏ రంగంలో రాణించాలి అన్నా కృషి, పట్టుదల రెండు అవసరమని పేర్కొన్న ఎర్రబెల్లి తను స్కూల్లో చదువుకున్న రోజుల్లో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆటల్లో కూడా ఎప్పుడు తాను ముందుండే వాడినని, ఎన్నో బహుమతులను గెలుచుకునే వాడినని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రాజకీయాలలోకి తన తండ్రి ప్రోత్సాహంతో వచ్చానని, రాజకీయాలలో విజయం సాధించాలన్న కసితో, పట్టుదలతో తాను నేడు ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.

కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ : మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు. ఒకసారి ఎంపీగా గెలిచానని ప్రస్తుతం రాజకీయాలలో రాణిస్తున్నానని, ప్రజల ఆదరణ, అభిమానం కారణంగా గత 30 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఎర్రబెల్లి చేసిన తాజా వ్యాఖ్యలతో అందరిలోనూ ఒక కొత్త ఆసక్తి కనిపిస్తుంది. ఎర్రబెల్లి ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి? ఎర్రబెల్లి ఏం ఆశిస్తున్నారు అంటూ కొందరు చర్చిస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications