కేంద్రంలో పొగడ్తలు; రాష్ట్రంలో తెగడ్తలు: వాళ్ళు గ్రామాల్లోకొస్తే నిలదీయండి: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్, ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీల దుష్ట పరిపాలన వల్లే దేశంలో దుష్ప్రభావాలు ఏర్పడ్డాయని, దేశం ఏళ్లకేళ్లు వెనుకబడి పోయిందని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేశారు.
కేంద్రంలోని బిజెపి తెలంగాణ రాష్ట్రాన్ని పొగుడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కొనియాడుతూ, అవార్డులు ఇస్తూ, రాష్ట్రంలో అందుకు భిన్నంగా మాట్లాడుతుందని విమర్శించారు. కేంద్రంలో మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలపై పొగడ్తలు గుప్పించి, రాష్ట్రానికి వచ్చే సరికి విమర్శలు చేస్తూ, సీఎం కెసిఆర్‌ను, ఆయన పాలనను తిడుతున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో బిజెపి వైఖరిని తిప్పి కొట్టాలని, బిజెపి నాయకులు ఎవరైనా గ్రామాలకు వస్తే వారిని నిలదీయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.

సీఎం కెసిఆర్ లాంటి పరిపాలనా దక్షుల అవసరం దేశానికి, రాష్ట్రానికి ఏర్పడిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బిజెపి, కాంగ్రెసు పాలనలో దేశంలో దుర్భిక్షం, ఆకలి పోకపోగా మరింత పెరిగాయని అందుకే దేశం మొత్తం సీఎం కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తోందన్నారు. దేశానికి కావాల్సింది గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ అని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రజలను ప్రశ్నించారు. అలాగే, రైతులకు ఇంతగా మేలు చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎక్కడా బాగుపడలేదని, అందుకే దేశంలో ఇన్ని సమస్యలున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రైతు సంక్షేమం జరుగుతుందన్నారు.
దేశంలో కెసిఆర్ లాగా ఎవరూ ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. కెసిఆర్ చేస్తున్నటువంటి ఇంత గొప్ప పరిపాలన నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. ప్రజలు కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని, వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications