బండి సంజయ్ పట్టపగలు దొరికిన దొంగ: మంత్రి హరీష్ రావు
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బిజెపి కుట్ర ఉందని, బండి సంజయ్ పాత్ర ఉందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రులు తమదైన శైలిలో బండి సంజయ్ ను టార్గెట్ చేస్తున్నారు.
బండి సంజయ్ అరెస్టుపై మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. కెసిఆర్ ని ఎదురుకోలేక బిజెపి ఈ విధంగా ప్రవర్తిస్తుందని, బిజెపి కుట్రలు నగ్నంగా నిన్న బయటపడ్డాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పట్టపగలు దొరికిన దొంగ బండి సంజయ్ అంటూ బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. నిన్న మధ్యాహ్నం పేపర్ లీక్ అయిందని బిజెపి వాళ్లు ధర్నా చేశారని, సాయంత్రం పేపర్ లీక్ లో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని ధర్నా చేశారని, పేపర్ లీక్ చేసింది బిజెపి నాయకుడేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

విద్యార్థి లోకం బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ ను ఎదుర్కోలేక, నీచ రాజకీయాలకు దిగజారారని బిజెపి నేతల తీరుపై మండిపడ్డారు. పదవ తరగతి ప్రశ్నాపత్రాల పేపర్ లీకేజీ వెనక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అంటూ నిప్పులు చెరిగారు. తాండూరు, వరంగల్ పేపర్ లీకేజీ వెనక బండి సంజయ్ ఉన్నారని, పేపర్ లీకేజీ తో మీకు ఏమి ప్రమేయం లేకపోతే లీకేజీ గురించి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.
బిజెపికి చదువు విలువ తెలియదని, నకిలీ యుద్ధాలు చేసి, రోజుకో పేపర్ లీక్ అయిందని రచ్చ చేసి, తెలంగాణ విద్యార్థి లోకాన్ని, నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తుందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో కుట్రకు తెర తీసిన బండి సంజయ్ ను పార్టీ తక్షణం అధ్యక్ష పదవి నుండి తొలగించాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications