మేడారం జాతరలో కనిపించని మంత్రి కొండా సురేఖ మార్క్!
అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కొండా సురేఖకు ప్రాధాన్యత దక్క లేదా? కొండా సురేఖ ఎందుకు జాతరకు దూరంగా ఉన్నారు? దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కొండా సురేఖ మంత్రి సీతక్క చేసిన ఎంత హడావిడి ఎందుకు చేయలేదు? మేడారం జాతర విషయంలో కొండా సురేఖ అంటి ముట్టనట్టు ఎందుకు వ్యవహరించారు? అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చకు కారణంగా మారింది.
మేడారం జాతరలో పెద్దగా కనిపించని మంత్రి కొండా సురేఖ
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మహా జాతరలో కొండ సురేఖ పెద్దగా కనిపించకపోవడం వెనుక సురేఖ కావాలని దూరంగా ఉన్నారా లేక, రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క కు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మేడారం జాతరకు సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పగించారన్న అసహనంతో దూరంగా ఉన్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మేడారం జాతరలో కనిపించని మంత్రి కొండా సురేఖ హడావిడి
మేడారం జాతరలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క జాతర పనులను ప్రారంభం నుంచి పర్యవేక్షిస్తున్నారు. సీతక్క జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూడగా, మంత్రులు పొంగులేటి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హడావిడి చేస్తున్నారు. కానీ జాతరలో కొండా సురేఖ హడావుడి మాత్రం కనిపించలేదు.
మేడారం అభివృద్ధి పనులలో అంతర్గత విబేధాలు
మేడారం జాతర అభివృద్ధి పనులలో అంతర్గత విభేదాలు సురేఖ ఆరోపణలతో బయటకు వచ్చిన క్రమంలో, ఇక తాజాగా ఆమె మేడారం జాతరలో పెద్ద హడావిడి చేయకపోవడం వెనక ఏం జరుగుతుంది అన్న చర్చ జరుగుతోంది. జాతర ప్రారంభానికి ముందు నుండే మేడారంలో ఉండవలసిన మంత్రి సురేఖ అక్కడ కనిపించకపోవడం, ప్రముఖులు దర్శనం కోసం జారీ చేసిన వివిఐపి, వీఐపీ పాసుల విషయంలో కూడా ఆమె నిర్లక్ష్యానికి గురైనట్టు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
మంత్రి సురేఖ ప్రాధాన్యం తగ్గుతుందా?
నేడు మంత్రి సురేఖ మేడారం జాతరలో నిలువెత్తు బంగారాన్ని నివేదించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకోవలసిన మంత్రి రాష్ట్రంలోని మిగతా మంత్రుల లాగా మేడారం జాతరకు వచ్చి వెళ్ళటం మంత్రివర్గంలో ఆమె ప్రాధాన్యత తగ్గుతుంది అన్న సంకేతాన్ని ఇస్తుందన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా మేడారం జాతర తర్వాత ఈ విషయంలో కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారు అన్నది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications