మహిళలు కోటీశ్వరులు అయ్యేలా.. వడ్డీలేని రుణాలు.. మరో శుభవార్త!
మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్య ఉద్దేశంతో ఇందిర మహిళా శక్తి పథకాన్ని ఏర్పాటు చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలంగాణ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దుతామన్నారు.
ఇందిరా మహిళా శక్తి కాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సురేఖ
నేడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కాంటీన్ ను ప్రారంభించిన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్రంలో ఏడాది కాలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతున్నామన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొన్ని కార్యక్రమాలు చేశామని ఆమె తెలిపారు.

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
ఎంజీఎం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించి ఈ క్యాంటీన్ ద్వారా ఎంజీఎం కి వచ్చే రోగులకు మంచి ఆహారాన్ని అందిస్తారని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, వారి పురోగతికి దోహదం చేస్తామని చెప్పారు. మహిళల ఆర్ధిక పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఎంజీఎంలో రోగుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట
ఇక ఎంజిఎం ఆసుపత్రిలో అనధికారికంగా ఉంటున్న షాపులను తొలగిస్తున్నామని తెలిపిన మంత్రి ఎంజీఎం కి వచ్చే రోగులను దృష్టిలో పెట్టుకొని వసతులను కల్పిస్తున్నామన్నారు. రోగులు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా ఓపి నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, డయాలసిస్ రోగులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా మరిన్ని డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.ఈ మేరకు సిఎస్ఆర్ ఫండ్స్ తో ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు.
సీఎం రేవంత్ తో చర్చించా.. త్వరలోనే సమస్యల పరిష్కారం
ఎంజీఎం ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించానని, త్వరలో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. ఆస్పత్రిలో నూతనంగా ఫార్మసీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోగులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కలెక్టర్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ఎంజీఎం లో మెరుగైన సేవలు కోసం ఒకటికి పది సార్లు కలెక్టర్ సందర్శిస్తున్నారని కొండా సురేఖ అన్నారు. ఎంజీఎం ఆస్పత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications