పొంగులేటి ఇమేజ్ ను అమాంతం పెంచేసిన జాతీయపార్టీలు.. ఖమ్మంలో చర్చ!!
తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మా పార్టీలోకి రమ్మంటే, మా పార్టీలోకి రావాలి అంటూ జాతీయ పార్టీలు పోటీ పడి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టించుకోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జాతీయ పార్టీలు ఇంతగా పట్టించుకోవడం స్థానికంగా ఖమ్మంలో సైతం చర్చనీయాంశంగా మారింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి ఖమ్మంలో ఐదారు సీట్లు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోటాపోటీగా పార్టీలోకి రావాలంటూ చర్చలు జరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ టీం వచ్చి మరీ చర్చలు జరిపింది.

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్లలో రెండు సీట్లు తప్ప మిగతా సీట్లన్నీ పొంగులేటి చెప్పినవారికి ఇస్తామని కూడా వారి హామీ ఇచ్చినట్టు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఇక బిజెపి చేరికల కమిటీ నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరిపింది.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బిజెపి చేరికల కమిటీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోపాటు, జూపల్లి కృష్ణారావు పార్టీలోకి ఆహ్వానిస్తూ పొంగులేటి నివాసంలో భేటీ అయి చర్చించారు. అంతకు ముందు కూడా అనేక మార్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. అయినప్పటికీ ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ లో చేరడానికి కూడా సుముఖత వ్యక్తం చెయ్యలేదు.
ఆయన కాంగ్రెస్ లో చేరతారా.. బీజేపీలో చేరతారా అన్నది ఇప్పుడు ఖమ్మం రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. ఇదిలాఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ పార్టీలతో బేరసారాలు చేయడం, ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం వంటి పరిణామాలు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇమేజ్ ను అమాంతం పెంచేశాయి.
జాతీయ పార్టీలు పోటీ పడి ఆయన కోసం పడరాని పాట్లు పడుతున్నాయి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లో అంత మ్యాటర్ ఉందా అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా బి ఆర్ ఎస్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బి ఆర్ ఎస్ నాయకుడిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని శపథం చేసిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరికకు ఆసక్తి చూపిస్తారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.












Click it and Unblock the Notifications