OSCAR for Naatu Naatu: ప్రతీ భారతీయుడు గర్వపడాల్సిన క్షణాలు; ఒళ్ళు పులకించింది: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నాటునాటు పాట ఆస్కార్ అవార్డు సాధించడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన క్షణాలివి అని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.
RRR సినిమాలోని నాటు నాటు పాట అకాడమీ వేదికపై అదరగొట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు వాళ్ళందరినీ ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ లు ఆస్కార్ విజేతలకు అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఆస్కార్ దక్కించుకున్న తొలిచిత్రంగా RRR చిత్రం నిలిచింది. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ విన్నర్ గా నిలవడంపై సినీ ప్రముఖుల నుంచి మంత్రుల, నుంచి ప్రశంసలు జల్లు కురుస్తోంది.

భారతీయులు గర్వపడాల్సిన క్షణాలివి: చిరంజీవి
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నాటునాటు పాట ఆస్కార్ అవార్డు సాధించడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన క్షణాలివి అని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గురించి తెలిసిందన్నారు. దర్శకుడు రాజమౌళి గారికి, సంగీత దర్శకుడు కీరవాణి గారికి, పాట రాసిన చంద్రబోస్ గారికి, తారక్, చరణ్ లతో పాటు పాట పాడిన రాహుల్ సిప్లింగంజ్, కాలభైరవ తో సహా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

ఈ విజయంలో చరణ్ భాగం కావటం తమ కుటుంబానికి సంతోషం
చారిత్రాత్మక కీర్తిని భారతీయ సినిమాకి తీసుకువచ్చిన దర్శకుడు రాజమౌళిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక భాగం కావడం తనకు, తన కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, ఈ విజయం ఫ్యామిలీకి గర్వకారణం అని చిరంజీవి వెల్లడించారు. ఆస్కార్ ఇవ్వడం వెనుక క్రెడిట్ ఒక చరణ్ కు మాత్రమే కాదు అందరికీ చెందుతుంది అన్న చిరంజీవి ఆస్కార్ అవార్డుల వేళ ముందు లోపల తెలియని టెన్షన్ ఉందని, వేరే ఎవరికైనా అవార్డు వస్తుందేమోనని కాస్త అనుమానం ఉన్నాడని అన్నారు.

అది చూసి ఒళ్ళంతా పులకించిపోయింది
ఎవరికి వచ్చిన సంతోషమే కానీ మనకు ఆస్కార్ రావడం అనేది చారిత్రాత్మక గొప్ప విజయమని తాను భావిస్తున్నట్లుగా చిరంజీవి వెల్లడించారు. ఆస్కార్ రావడం వెనుక కృషి చేసిన ప్రతి ఒక్కరికి తన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. 8 దశాబ్దాలు దాటిన తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని ప్రపంచ స్థాయి గుర్తింపు ఆర్ ఆర్ ఆర్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. నాటు నాటు లైవ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం చూస్తే ఒళ్ళంతా పులకించిపోయిందని చిరంజీవి పేర్కొన్నారు.

తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని గడించటం చూస్తే పట్టరాని సంతోషం
ఒకప్పుడు దేశంలోనే తెలుగు అనేది ఒకటి ఉందని తెలిసేది కాదు. అలాంటిది ఈరోజు ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ ద్వారా ప్రపంచానికే తెలుగు సినిమా తెలిసిందన్నారు చిరంజీవి. తెలుగు సినిమా వివక్షకు గురవుతున్నట్టు అనేక సార్లు భావించానని, కానీ ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని గడించటం చూస్తే పట్టరాని సంతోషంతో చాలా భావోద్వేగానికి గురవుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, హాలీవుడ్ వచ్చినప్పుడే క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వచ్చినప్పుడే ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నామన్నారు చిరంజీవి. కొడుకు ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే తాను ఒక తండ్రిగా ఆనంద పడుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications