OSCAR for RRR Naatu Naatu: అద్భుతమన్న కేటీఆర్, ఎర్రబెల్లి, పువ్వాడ ప్రశంసల జల్లు!!
ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ అవార్డు గెలవటంపై మంత్రి ఎర్రబెల్లి, పువ్వాడతో కలిసి మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోడీని టార్గెట్ చేసి చురకలు అంటించారు.
తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిన, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై, నాటు నాటు పాటపై ప్రముఖుల ప్రశంసలు జల్లు కురుస్తుంది. తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలియజేసిన సినిమాగా ఆర్ఆర్ చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఈ చిత్రంలోని పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తెలంగాణ మంత్రులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
సంబరాలు జరుపుకునే కోట్లాదిమంది భారతీయులలో తాను ఒకడిని: మంత్రి కేటీఆర్
తాజాగా మంత్రి కేటీఆర్ ఆస్కార్ అవార్డుల విజయం పట్ల తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అద్భుతంగా పనిచేసి ఆస్కార్ అవార్డును సాధించిన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి హాట్సాఫ్ చెబుతున్నామని పేర్కొన్న కేటీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా మరియు నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుపొందడంపై సంబరాలు జరుపుకునే కోట్లాదిమంది భారతీయులలో తాను ఉన్నానన్నారు.

మోడీ వల్లనే ఆస్కార్ అవార్డులు వచ్చాయన్నా అంటారు: కేటీఆర్ చురకలు
సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి గారికి, పాటల రచయిత చంద్రబోస్ గారికి భారతదేశంలో గర్వపడేలా చేసిన అద్భుతమైన డైరెక్టర్ రాజమౌళి గారికి నా సోదరులు ఇద్దరు సూపర్ స్టార్లు తారక్ మరియు రామ్ చరణ్ లకు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఆపై ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ ను గెలుచుకున్నందుకు ది ఎలిఫెంట్ విస్పరర్ బృందానికి అభినందనలు తెలియజేశారు మంత్రి కేటీఆర్. ఇంకేముంది మోడీ వల్లనే ఆస్కార్ అవార్డులు వచ్చాయని పబ్లిసిటీ మొదలుపెడతారు అంటూ కేంద్రం లోని బీజేపీ సర్కార్ కు చురకలంటించారు మంత్రి కేటీఆర్.

తెలంగాణ సినిమాని, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన నాటు నాటు పాట: మంత్రి ఎర్రబెల్లి
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపి, నాటు నాటు పాట తెలంగాణ సినిమాని, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందన్నారు. నాటు నాటు పాట రాసిన చంద్రబోస్, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు, సంగీత దర్శకత్వం అందించిన కీరవాణి, దర్శకుడు రాజమౌళి లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నాటు నాటుపాట ప్రపంచాన్ని ఆకర్షించడానికి కీలక భూమిక వహించిన కథానాయకులు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

చంద్రబోస్ ఓరుగల్లు ముద్దు బిడ్డ : మంత్రి ఎర్రబెల్లి
పాట రాసిన చంద్రబోస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కావడం మాకు గర్వంగా ఉందన్నారు. ఆస్కార్ బరిలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ కేటగిరిలో గెలిచిన ది ఎలిఫెంట్ విస్పరర్ చిత్ర యూనిట్ కి కూడా మంత్రి దయాకర్ రావు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ వచ్చిన తర్వాతే, సీఎం కెసిఆర్ గారి ప్రోత్సాహంతో తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇంకా మంచి సినిమాలు తీసి ప్రపంచ ఖ్యాతిని తెలంగాణకు, తద్వారా దేశానికి అందేలా కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.

భారతీయులు గర్వపడేలా చేసిన ఆర్ఆర్ఆర్ : మంత్రి పువ్వాడ
భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించిన ఆర్.ఆర్.ఆర్ చిత్ర సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణికి, గీత రచయిత చంద్రబోస్ కి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు... పాటకు ఆస్కార్ లో స్థానం దక్కడం పట్ల తెలుగు చలనచిత్ర రంగం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిందన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications