ఉద్రిక్తతలకు కారణంగా ఓయూ నిరుదోగ్య మహాదీక్ష; రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ తో టెన్షన్!!
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం దుమారంగా మారింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే, మరోవైపు ఆందోళనలు సైతం ఉదృతం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. నిరుద్యోగ యువతను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షా పత్రాలు లీకేజీలతో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కెసిఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు.
తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ మహాధర్నా నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ మహా ధర్నాకు మద్దతు తెలుపుతానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పహార కాస్తున్నారు. ఆయనను గృహ నిర్బంధం చేశారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ మహాదీక్ష సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం పై ఓయూ జేఏసీ నేడు మహా నిరసన దీక్ష చేపట్టనుంది. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ మహాదీక్షతోపాటు, ప్రగతి భవన్ వరకు నిరుద్యోగుల మార్చ్ చేపట్టనున్న నేపథ్యంలో నిరుద్యోగుల మహా నిరసన దీక్షకు అసలు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు నిరుద్యోగులు నిర్వహిస్తున్న మహా నిరసన దీక్షకు తన మద్దతును తెలపడానికి వెళతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా వెళ్లి తీరతానని ఆయన తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా టెన్షన్ వాతావరణ చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ మహా దీక్షను కచ్చితంగా నిర్వహించి తీరుతామని ఓయూ జేఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు. భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది .

మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి రావాలని ప్రయత్నిస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే అడ్డుకుని తీరుతామని బిఆర్ఎస్వి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుందని భావిస్తున్న పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications