Papikondalu Tour: హైదరాబాద్ టూ పాపికొండలు టూర్.. ఇలా ప్లాన్ చేసుకోండి..!
తెలుగు రాష్ట్రాల్లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోదగిన, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయదగిన పర్యాటక ప్రాంతాల్లో పాపికొండలు టూర్ ఒకటి. పాపికొండలు టూర్ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు ఎగిరి గంతేస్తారు. అలా గోదావరి నదిలో పడవ ప్రయాణం.. చుట్టూ కొండలు.. చల్లని, ప్రశాంతమైన వాతావరణం మాటల్లో చెప్పలేనిది. అయితే దాదాపు 20 రోజులపాటు పాపికొండలు టూర్ ఆగిపోయింది. ఎట్టకేలకు తాజాగా బోటు సేవలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. దాంతో జూలై 5వ తేదీ నుంచి ఈ విహారయాత్ర ప్రారంభం కానుంది.
పాపికొండలు తూర్పు కనుమలలో ఉన్న ఒక సుందరమైన కొండల ప్రదేశం. ఈ పాపికొండలు ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మధ్య విస్తరించి ఉన్నాయి. పాపికొండలు రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో అలాగే తెలంగాణలోని భద్రాచలం నుంచి 70 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి పాపికొండలు యాత్ర చేయాలంటే ముందుగా భద్రాచలం చేరుకోవాల్సి ఉంటుంది. భద్రాచలంలో రాములవారి దర్శనం అనంతరం రాత్రికి అక్కడే బస చేసి తెల్లవారుజామున పాపికొండలు విహారయాత్రకు చేరుకోవచ్చు.
అయితే ఈ టూర్ కోసం ఏపీ టూరిజం, తెలంగాణ టూరిజం లేదా ఇతర ఏజెన్సీల ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇక తెలంగాణ నుంచే కాకుండా రాజమండ్రి నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఈ టూర్ ఉదయం 7:30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుంచి లేదా భద్రాచలంలోని పోచారం ఘాట్ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుండి పోలవరం, గొందూరు పోచమ్మ గండి, సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా యాత్ర సాగుతుంది.

ఇక పాపికొండలు టూర్ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. అలాగే ఇక్కడి బ్యాంబూ చికెన్, గోదావరి స్టైల్ చేపల పులుసును కూడా లాగించేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సారి పాపికొండలు టూర్ ట్రై చేయండి.. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు https://tourism.ap.gov.in/tours,www.aptourismrajahmundri.com ద్వారా తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications