మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. రైతన్నలకు మరో పెద్ద కష్టం!
తెలంగాణలో రైతన్నలకు పెద్ద కష్టం వచ్చింది. వర్షాలు సరిగా లేకుండా పోవడంతో రైతులు ఇప్పటికే నీటి కొరతతో కష్టపడుతున్నారు. అందులోనూ పంటలపై తెగుళ్లు విజృంభించి మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో ప్రధాన పంటలు వివిధ తెగుళ్ల బారిన పడ్డాయి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, జగిత్యాల, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, సంగారెడ్డి తదితర జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది.
వరి పంట ఎక్కువ ప్రాంతాల్లో అంకుర దశలో లేదా కాత వేసే దశలో ఉంది. ఆకు ఎండు తెగులు, కాండం తొలుచు పురుగు, ఆకుముడత వంటివి వ్యాప్తి చెందుతున్నాయి. దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో ఈ సమస్య కనిపిస్తోంది. పత్తి కాయ పగిలే దశలో ఉన్న ప్రాంతాల్లో గులాబీరంగు పురుగు, తామర పురుగు, పచ్చదోమ బెడద మొదలైంది. ఆకులు, కాండం ఎండిపోయి కాయల్లో పత్తి తగ్గిపోతోంది.

మొక్కజొన్నలో కాండం కుళ్లు, ఆకుమచ్చ, కుంకుమ తెగుళ్లు వచ్చి మొక్కలు పడిపోతున్నాయి. సోయాచిక్కుడులో కాయ ఎండు తెగులు, కందిలో శనగపచ్చ తెగులు కూడా వ్యాప్తి చెందాయి. వేరుసెనగ, మిరప, టమాటా వంటి పంటలకు కూడా నారు కుళ్లు సమస్యగా మారింది. రైతులు పురుగుమందులు పిచికారి చేసినా సరైన ఫలితం రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయశాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిపుణులు సమగ్ర పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులు అనుసరించాలని సూచిస్తున్నారు. అవసరమైన చోట మాత్రమే సరైన మందులు వాడాలని, అధిక నత్రజని ఎరువులు వాడకుండా జాగ్రత్తపడాలని చెబుతున్నారు.అసలే ఎల్ నినో తో ఇబ్బంది పడుతున్న రైతన్నలకు ఇప్పుడు పంటలకు తెగుళ్ళు, చీడ పీడలు ఇబ్బందిగా మారాయి.
వర్షాభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే యాసంగి సీజన్లో నీటి వినియోగం తక్కువగా ఉండే పంటల వైపు మళ్లాలని కూడా సలహా ఇస్తున్నారు. రైతులు స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించి సకాలంలో చర్యలు తీసుకుంటే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఏది ఏమైనా తెలంగాణా రైతులు ఇప్పుడు కష్ట కాలాన్ని చూస్తున్నారు.













Click it and Unblock the Notifications
